పులివెందులలోని ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు, ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంతో పాటు ఒంటిమిట్ట మండలంలో జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల కోసం రెండు మండలాల పరిధిలో సుమారు 1500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతోంది.
ఈ ఎన్నికలపై వైకాపా చీఫ్ జగన్ మండిపడ్డారు. పోలింగ్ రోజున మీడియా కవరేజీని నియంత్రించి, తమ దాడులు, దౌర్జన్యాలు బయటకు రాకుండా చూడాలని టీడీపీ ప్లాన్ చేసిందని జగన్ అన్నారు. "నిజం చెప్పాలంటే వీటిని ఎన్నికలు అనడానికే సిగ్గుగా ఉంది. అయినా నాకు దేవుడిపై, ప్రజలపై నమ్మకం ఉంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది" అని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ఎన్నికలను హైజాక్ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ గూండాలు, కొందరు అధికారులు, పోలీసులు కలిసి ఈ కుట్రను అమలు చేస్తున్నారని విమర్శించారు.