హైదరాబాద్: 500, వెయ్యి నోట్ల రద్దు ఎఫెక్ట్ సినీ పరిశ్రమపైనా భారీగా పడుతోంది. కోట్ల రూపాయల పెట్టుబడులు... భారీ ఎత్తున ఫైనాన్స్‌లతో నడిచే సినీ పరిశ్రమ ఇపుడు మోదీ దెబ్బకు అవాక్కయ్యింది. ఇప్పటికే చాలా సినిమాల నిర్మాణానికి మధ్యలోనే ఫైనాన్స్ సమస్య వచ్చేసింది. ప్రొడక్షన్లు కొనసాగించాలా? నిలిపివేయాలా అని నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పాలసీ ఏంటో స్పష్టం కాక, ఇటు భారీగా నగదు ఫైనాన్స్ పుట్టక... యాక్టర్లు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్ ఎలా ఇవ్వాలో తెలీక... అంతా తికమకగా ఉంది.
సినీ పరిశ్రమలో వ్యవహారాలంతా మూడొంతులు బ్లాక్ లోనే నడుస్తాయి. హీరోలు, హీరోయిన్ల రెమ్యూనరేషన్ కూడా బ్లాక్ ఎంత... వైట్ ఎంత అనే తరహాలోనే నడుస్తుంది. వారికి ఇచ్చేది కోట్లలో అయినా, చూపించేది మాత్రం లక్షల్లోనే ఉంటుంది. ఇపుడు పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ ఎలా ఇవ్వాలనేది సమస్య. ప్రధాని మోదీ చెపుతున్నట్లు అంతా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేయాలంటే, ఇన్‌కంటాక్స్ పేలిపోతుంది. పైగా కలెక్షన్ల లెక్కలన్నీ వైట్లో చేయాలంటే, పరిశ్రమ మునిగిపోవడం ఖాయం.
అయినా అంతా వైట్‌గా జరగాలని కేంద్రం చెపుతున్న విధానాలను పాటించాలంటే... మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలోకి వెళ్లిపోతామని నిర్మాతలు అంటున్నారు. ఆ కాలంలో హీరోలకు, హీరోయిన్లకు, టెక్నీషియన్లకు రోజువారి వేతనాలు చెల్లించేవారు. అది అయితే, రోజువారిగా ఆర్టిస్టులకు పేమెంట్లు... అంతా ఖర్చు వైట్‌గా చూపడానికి బాగుంటుందని అంటున్నారు. ఇక హీరోలకు కోటానుకోట్ల రెమ్యూనరేషనిచ్చే పరిస్థితి లేదని, అసలు ఇవ్వడానికి నోట్లు లేవని నిర్మాతలు అంటున్నారు. ఇటు టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు... అటు బాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంటున్నాయట... అకటా! మోదీ ఎఫెక్ట్.