'ధృవ నక్షత్రం'తో ఆ దర్శకుడు కుస్తీలు... ఎప్పుడు పొడుస్తుందో?

శుక్రవారం, 28 డిశెంబరు 2018 (16:16 IST)
గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తొలి చిత్రాన్ని ప్లాన్ చేసి, దానికి 'ధృవ నక్షత్రం' అని టైటిల్ పెట్టారు. దాదాపు రెండేళ్ల క్రితం షూటింగ్ మొదలైన ఈ సినిమాకు అప్పట్లోనే ఫస్ట్‌లుక్‌, టీజర్‌ విడుదల చేసారు. సాధారణంగా గౌతమ్ మీనన్ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉంటాయి, అదీ కాకుండా వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది మొదటి సినిమా కావడంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. 
 
కానీ ఈ చిత్రం షూటింగ్ మొదలై ఇప్పటికే రెండేళ్లు దాటిపోతోంది, ఈ వ్యవధిలో విక్రమ్ హీరోగా నటించిన రెండు సినిమాలు కూడా విడుదలయ్యాయి. మొదట్లో శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఎందుకో అనుకున్నంత వేగంగా విడుదల కాలేదు. ఆర్థిక సమస్యలు తలెత్తడంతోనే ఆలస్యం జరుగుతున్నట్లు సినీవర్గాల సమాచారం.
 
ఇప్పుడు విక్రమ్, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా కమల్‌హాసన్‌ నిర్మిస్తున్న 'కడారం కొండాన్‌' చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'ధృవనక్షత్రం' షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని గౌతమ్‌మీనన్‌ ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. 'కడారం కొండాన్‌' పూర్తయిన వెంటనే 'ధృవనక్షత్రం' షూటింగ్‌‌ను పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రీతూవర్మ నటిస్తున్నారు. రానున్న సంవత్సరంలో అయినా ఈ సినిమాకు మోక్షం కలుగుతుందేమో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు