సినీ నటుడు రాజీవ్ కనకాలకు పితృవియోగం....

శుక్రవారం, 2 ఆగస్టు 2019 (17:25 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు, నటుడు దేవదాస్ కనకాల తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన... హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భార్య లక్ష్మీదేవి ఇటీవలే కన్నుమూసిన విషయం తెల్సిందే.
 
ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్ కనకాల ఈయన కుమారుడే. అలాగే, ఈయనకు శ్రీలక్ష్మి అనే కుమార్తె ఉంది. ఈయన స్టార్ యాంకర్ సుమకు స్వయానా మామగారు. 
 
దేవదాస్ కనకాల అనేక చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, పలు చిత్రాల్లో నటించారు. ఈయన 1945 జూలై 30వ తేదీన జన్మించారు. ఈయన స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. విశాఖపట్టణంలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు. 
 
పైగా, అనేక నటీనటులకు శిక్షణ కూడా ఇచ్చారు. దేవదాస్ కనకాల స్థాపించిన శిక్షణాలయంలో అగ్రనటులు చిరంజీవి, రజనీకాంత్, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి వంటి అనేక మంది నటీనటులు శిక్షణ పొందారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు