గురువారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన స్పందిస్తూ, 7 లక్షల మెడిక్లెయిమ్ పాలసీని కౌన్సిల్ లోని ప్రతీ సభ్యుడికీ అందజేయాలని డిమాండ్ చేశారు. నిధులు తక్కువగా ఉంటే కనీసం 5 లక్షల పాలసీ అయినా అందరికీ వర్తింపచేయాలని ఆయన సూచించారు.
ఇదీ దాసరి చరిత్ర" సినిమా
సినీ పరిశ్రమ నిలబడటానికి దాసరి లాంటి పెద్దలు కారణమని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆయన తట్టుకుని తన ప్రత్యేకతను చాటుకున్నారని నట్టి కుమార్ అన్నారు. తన ప్రయాణంలో ఆయనను ఆకాశానికి ఎత్తినవాళ్లు ఉన్నారు, అలాగే అవమానించిన వాళ్లు లేకపోలేదని చెప్పుకొచ్చారు. అందుకే ఆయన సినీ జీవిత ప్రయాణాన్ని పలు అంశాలతో నేటి తరానికి అందించాలన్న సత్ సంకల్పంతో "ఇదీ దాసరి చరిత్ర" పేరుతో ఓ సినిమాను తీయాలని నిర్ణయించుకున్నానని, అయితే ఇది బయోగ్రఫీ కాదని నట్టి కుమార్ వెల్లడించారు. మే 4న దాసరి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. దాసరి పాత్రధారి, ఈ సినిమాకు సంబందించిన ఇతర విషయాలు మళ్ళీ తెలియజేస్తామని అన్నారు.
పార్లమెంట్ లో దాసరి విగ్రహం
కాపు, బలిజ, తెలగ తదితర కులాల పక్షాన తరపున, అలాగే రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేయడంతో పాటు సినీ రంగానికి దర్శకరత్న దాసరి నారాయణరావు చేసిన విశేష సేవలను గుర్తించి విగ్రహాన్ని పార్లమెంట్ ప్రాంగణంలో పెట్టాలని, అలాగే హైదరాబాద్ ఫిలింనగర్ లోను, పుట్టిన ఊరు పాలకొల్లు లోను దాసరి పేరుతో ప్రత్యేకంగా పార్కులను నిర్మించేలా వివిధ రాజకీయ పక్షాలకు, వివిధ రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, మంత్రులు కేటీఆర్, అంబటి రాంబాబు, రోజా, ఎం.ఎల్.సి కవిత, ఎం.ఎల్.ఏ. కొడాలి నాని, బీజేపీ నాయకులు బండి సంజయ్, సోము వీర్రాజు, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి వంటివారు కృషి చేయాలని ఆయన కోరారు.
నేటి సినీ పెద్దలు అక్కడా ఉంటారు...ఇక్కడా ఉంటారు
తామే సినీ పెద్దలమని చెప్పుకునే కొందరు సినీ పెద్దలు పూర్తిగా స్వార్ధ రాజకీయాలు చేస్తూ, చిన్న సినిమాలను చంపేస్తూ, చిన్న నిర్మాతల వినాశనానికి పూనుకుంటున్నారని ఇదే ప్రెస్ మీట్లో నట్టి కుమార్ ఆరోపించారు. త్వరలో జరగబోయే తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు, ఇంకా నిర్మాతల గిల్డ్, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సినిమా పరిశ్రమతో ఉన్న సంబంధాలకు సంబందించిన అంశాలపై ఆయన చర్చించారు. 21 మంది నిర్మాతలు కేవలం వాళ్ల స్వార్ధం కోసం గిల్డ్ అని వేరే కుంపటి పెట్టుకుని కూడా తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిపై కూడా పెత్తనం చెలాయించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. దిల్ రాజు, దామోదర ప్రసాద్, స్రవంతి రవికిశోర్ వంటి వారు అక్కడా తమదే రాజ్యం... ఇక్కడా తమదే రాజ్యం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వాళ్ళంతా చిన్న నిర్మాతల గురించి అస్సలు ఆలోచించరు . అందుకే అలాంటి వాళ్లను ఎన్నుకోకుండా ఓటర్లు జాగ్రత్త పడాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు.
తలసాని, పోసాని, అలీ అందరినీ కలుపుకోవాలి
ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ ఇంతవరకు సినీ పరిశ్రమ వారితో ఎలాంటి మీటింగ్ పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోందని నట్టి కుమార్ స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిన్న నిర్మాతల కంటే పెద్దవాళ్లతోనే సత్ సంబంధాలు కలిగి ఉంటారని, కానీ అందరినీ కలుపుకుపోవాలని అన్నారు. తెలంగాణ ఎఫ్.డి. సి చైర్మన్ ఎవరో కూడా తెలియడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమా పరిశ్రమ షూటింగులు విరివిగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల తరపున పదవులలో ఉన్నవారు కనీసం నెలకొకసారైనా మీటింగ్ లు పెట్టి, అందరినీ కలుపుకుని పోవాలని అన్నారు.