అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై ట్విస్టుల మీద ట్విస్టులు మొదలయ్యాయి. శ్రీదేవి గుండెపోటుతో మరణించిందనే వార్త రాగానే యావత్తు సినీ ప్రపంచం శోకంలో మునిగిపోయింది. ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు, బంధువులు దిగ్భ్రాంతికి గురైయ్యారు. అయితే యూఏఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ మాత్రం ఆమె ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి ప్రాణాలు కోల్పోయిందని పేర్కొంది. దీంతో శ్రీదేవికి గుండెపోటు అని బోనీ కపూర్ ఎందుకు చెప్పారనే దానిపై విచారణ జరుగుతోంది.
బాత్ టబ్‌లో శ్రీదేవి అచేతనంగా పడివుంటే తొలుత స్నేహితుడికి ఫోన్ చేశానని బోనీ కపూర్ పొంతన లేకుండా బదులివ్వడం అనుమానాలకు తావిస్తోంది. శ్రీదేవి అచేతనంగా పడివుంటే వైద్యులను ఎందుకు పిలిపించలేదని పోలీసులు బోనీ కపూర్ వద్ద విచారణ జరుపుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బోనీ కపూర్‌ను పోలీసులు మూడు గంటల పాటు విచారించినట్లు దుబాయ్ మీడియా వెల్లడించింది. బోనీ వాంగ్మూలాన్ని వారు రికార్డు చేసుకున్నారని కూడా సదరు మీడియా తెలిపింది.
శ్రీదేవి స్పృహ కోల్పోయాక సమీపంలో ఉన్న రషీద్ ఆసుపత్రికి తరలించారు. అయితే, శ్రీదేవిని పరీక్షించిన వైద్యులు అప్పటికే శ్రీదేవి మరణించినట్లు ధ్రువీకరించారు. ఇంకా శ్రీదేవి శవ పరీక్ష అనంతరం, ఇధ్దరు వైద్యులు, ఆసుపత్రిలోని మరో ఐదుగురు అటెండర్ల వద్ద కూడా పోలీసులు విచారణ జరిపినట్లు దుబాయ్ మీడియా తెలిపింది.