ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్ ఇకలేరు

ఠాగూర్

మంగళవారం, 26 నవంబరు 2024 (16:16 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు సినీ గీత రచయిత కులశేఖర్‌ (53) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన  హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన 15-8-1971న సింహాచలంలో జన్మించారు. జర్నలిస్టుగా తన ప్రయాణం మొదలుపెట్టి తర్వాత 'చిత్రం' సినిమాతో చిత్రసీమలో అడుగు పెట్టారు. అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతూ మంగళవారం చివరిశ్వాస విడిచారు. 
 
సిరివెన్నెల సీతారామశాస్త్రి వద్ద శిష్యరికం చేసిన కులశేఖర్.. చిత్రం సినిమాతో గీత రచయితగా పరిచయమయ్యారు. తెలుగులో వందకు పైగా సినిమాలకు పాటలు రాశారు. చిత్రం, జయం, ఘర్షణ, వసంతం, మృగరాజు, ఇంద్ర, నువ్వు నేను, ఔదన్నా కాదన్నా, సుబ్బు ఇలా అనేక  సినిమాలకు కులశేఖర్ రాసిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
 
రాను రాను అంటూనే.. గాజువాక పిల్లా.. ఇలా కులశేఖర్ రాసిన పాటలు అప్పట్లో బాగా ప్రేక్షకాదరణ పొందాయి. గీత రచయితగా బిజీగా ఉండగానే.. దర్శకుడిగా మారి ప్రేమలేఖ రాశా అనే సినిమా చేశారు. దాని విడుదల ఆలస్యం కావటంతో మానసికంగా కుంగిపోయారు. 2008లో మెదడు సంబందిత వ్యాధితో జ్ఞాపకశక్తిని కొల్పోయారు‌. 2013లో కులశేఖర్పై ఆలయంలో దొంగతనం చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. చిత్రపరిశ్రమలో లిరిసిస్ట్‌గా పీక్ స్టేజ్‌ను చూసిన కులశేఖర్ అనంతరం మానసికంగా కుంగిపోయి, అనారోగ్యంపాలై కన్నుమూయడం విచారకరం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు