తెలుగు చలన చిత్ర చరిత్రలో అందరి అంచనాలను మించిపోయి కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్న ఫిదా సినిమా 14 రోజుల్లో 60 కోట్ల వసూళ్లతో ట్రేడ్ ఎనలిస్టులనే విస్మయానికి గురి చేస్తోంది. చిత్రం విడుదలకు ముందు ఆ.. ఇది శేఖర్ కమ్ముల మూవీ కదా.. దీని సత్తా ఏంటో మాకు తెలీదేంటి అంటూ కనుబొమలెగరేసిన వారు ఇప్పుడు రెండు వారాల తర్వాత ఫిదా రేంజ్ ఏమిటి. దీని కలెక్షన్లు ఎక్కడికి వెళ్లి ఆగబోతున్నాయి అని జుత్తు పీక్కుంటున్నారు. కేవలం నోటి మాటతో, రిపీటెడ్ ఆడియన్స్‌ను థియేటర్లలోకి రప్పిస్తున్న సినిమా ఈ మధ్య కాలంలో ఫిదా ఒక్కటే కావడం మరీ విశేషం.
చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయం సాధించిన చిత్రంగా ఫిదా రికార్డు సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన కలెక్షన్లతో థియేటర్లను దద్దరిల్ల జేస్తున్న ఫిదా సినిమా అతి తక్కువ కాలంలో 60 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి మూడోవారంలోకి దూసుకెళ్లింది. అతి తక్కువ సమయంలో ఒక చిన్న సినిమా ఇంత భారీ కలెక్షన్లను వసూలు చేయడం చరిత్రలో నిలిచిపోతుందని భావిస్తున్నారు.
ఒకవైపు చాలా బాగుంది అనే నోటిమాటలతో ప్రచారం జరుగుతుండటం, దానికి తగ్గట్లే చూసిన వారే మళ్లీ మళ్లీ ధియేటర్లకు రావడం, దీంతో కలెక్షన్లు రోజురోజుకూ నిలకడగా కొనసాగుతుండటం చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 35 కోట్ల షేర్ అందుకున్న ఫిదా సినిమా ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మరో పది రోజులపాటు పెద్ద సినిమాలు ఏవీ విడుదల కావు కాబట్టి ఆగస్టు 11 వరకు ఫిదా కలెక్షన్లకు ఢోకా లేదనిపిస్తోంది.
ఇదే విధంగా జోరు కొనసాగితే మొత్తంమీద ఫిదా 80 కోట్ల వరకు కలెక్ట్ చేయగలదని అంచనా. టోటల్ రన్‌లో 80 కోట్ల నుంచి 100 కోట్ల వరకు కూడా కలెక్షన్లు పెరిగే అవకాశముందని కూడా భావిస్తున్నారు. ఇదే జరిగితే ఫిదా రికార్డును బద్దలు కొట్టడం ఏ చిన్న సినిమాకూ సాధ్యం కాదు. అమెరికాలో బాహుబలి 2 తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించనున్న సినిమాగా కూడా ఫిదా రికార్డుకు చేరువలో ఉన్నట్లు సమాచారం.