తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఓ రౌడీ షీటర్ దెబ్బకు ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాల్లోని రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం పంచాయతీ జగ్యాతండాకు చెందిన బోడ సుశీల(28) పత్తి తీసేందుకు మరో మహిళతో కలిసి సోమవారం సమీప అమ్మపాలెం గ్రామానికి వెళ్లింది.
ఆమె ఇంటి ఎదురుగా ఉండే రౌడీషీటర్ ధరావత్ వినయ్ పొలంలో ఉన్న సుశీల వద్దకు వెళ్లి తన కోరిక తీర్చాలని వేధించాడు. ఆమె ప్రతిఘటించడంతో దాడికి పాల్పడ్డాడు. మనస్తాపం చెందిన బాధితురాలు ఇంటికి వచ్చి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సుశీలకు భర్త, కుమారుడు ఉన్నారు. వినయ్ వేధింపులు, దాడితో తన భార్య ఆత్మహత్య చేసుకుందంటూ భర్త శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
వినయ్‌పై నెల రోజుల క్రితమే రౌడీషీట్ తెరిచారు. సుశీల మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ఒంటిపై గాయాలున్నాయని, శవపరీక్షలో వాటిని పరిగణనలోకి తీసుకోలేదని, కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖమ్మం సర్వజనాసుపత్రి ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు.