తాను నటించిన తాజా చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి" పంచభక్ష్యపరమాన్నాలతో కూడిన విందుభోజనంలా ఉంటుందని ఆ చిత్ర హీరో బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ అభిమానులు సహస్ర పుణ్యక్షేత్ర జైత్రయాత్ర పేరుతో వంద దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటి తీర్థప్రసాదాల్ని శనివారం హైదరాబాద్‌లో బాలకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ నాన్న ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనే నాకు గురువు, దైవంతో సమానం. ఆయనలా నటుడిని అవ్వాలని అనుకున్నాను. కానీ నాన్న మాత్రం ముందు చదువుపై దృష్టిపెట్టామని చెప్పారు.
లేదంటే ఇప్పటివరకూ 250 సినిమాలు చేసేవాణ్ణి. అమ్మ ఆశయాలు, నాన్న ఆశీస్సులే నా విజయానికి దోహదపడ్డాయి. ప్రజాసంక్షేమమే పరమావధిగా దేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి గౌతమి పుత్రశాతకర్ణి. భరతజాతికి నూతన శకాన్ని ప్రసాదించాడు. రాజసూయ యాగం చేసిన మహా చక్రవర్తి. తెలంగాణలోని కోటిలింగాలలో పుట్టి మెదక్‌లోని కొండాపూర్ మొదలుకొని అమరావతి, ప్రతిష్టానపురం ఇలా దేశం నలుదిశలా తన సామ్రాజాన్యి విస్తరించిన పరాక్రమశీలి.
అలాంటి గొప్ప చక్రవర్తి కథతో క్రిష్ ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. పంచభక్ష్యపరమాన్నాలతో కూడిన విందుభోజనంలా సినిమా ఉంటుంది. అభిమానులతో కలిసి మొదటి రోజు చూడాలనే ఆలోచనతో ఉన్నాను. అందుకే ఇప్పటివరకూ సినిమాను చూడలేదు. ఇలాంటి మంచి సినిమాల్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయింపును ప్రకటించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
అదేసమయంలో తన కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేశామనేది ముఖ్యంకాదు. సమాజానికి ఉపయోగపడే మంచి సినిమాలు చేయాలన్నదే నా అభిమతం. సాంఘికం, జానపదం, పౌరాణికం..ఇలా అభిమానుల అండ వల్లే అన్ని రకాల సినిమాలు చేయగలిగినట్టు బాలకృష్ణ చెప్పుకొచ్చారు.