ఆయనను పూజిస్తూ క్రమశిక్షణతో నిబద్ధతతో ఈస్థాయికి వచ్చా : మెగాస్టార్ చిరంజీవి

డీవీ

సోమవారం, 8 జనవరి 2024 (15:41 IST)
Hanuman team with chiranjeevi
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్ ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
 
మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ,  వేడుకకు రావడానికి దోహద పడినవి నాలుగు కారణాలు. హనుమాన్ నా ఆరాధ్య దైవం, మా ఇలవేల్పు. ఆ స్వామి గురించి తెలిపే కథ ఈ హను మాన్. డైపర్లు వేసుకునే స్థాయి నుంచి డయాస్ లు ఎక్కే స్టేజ్ కి అంచలంచెలుగా ఎదుగుతున్న తేజ సజ్జ ఒక కారణం. ఈ చిత్రం ట్రైలర్ టీజర్ లో చాలా అద్భుతమైన ఫైన్‌నెస్‌ కనిపించింది. ఇవి చూసిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి అడిగి తెలుసుకున్నాను. ఖచ్చితంగా ఇది గొప్ప సినిమా అవుతుందని అనిపించింది. ఈ సినిమా వేడుకకు ముఖ్య అతిధిగా రావాలని కోరినప్పుడు ఖచ్చితంగా వస్తాను, అన్ని రకాలుగా నా ప్రోత్సాహం ఉంటుదని చెప్పడం జరిగింది. 
 
నేను కొలిచే హనుమంతుడి గురించి బయట ఎక్కడా చెప్పుకోలేదు. ఇలాంటి వేదికపై హనుమాన్‌ గురించి కచ్చితంగా చెప్పాలి. మా ఇంట్లో భక్తులెవరూ లేరు. మా నాన్న కమ్యూనిస్ట్‌. అమ్మ కోరిక మేరకు ఎప్పుడైనా తిరుపతి వెళ్లేవారు. నేను ఏడో తరగతి చదువుతుండగా ఆంజనేయస్వామి గుడికి వెళ్లి నమస్కారం చేసుకుని వచ్చేవాడిని. ఒకసారి లాటరీలోనూ ఆ స్వామి ఫొటో వచ్చింది. దాన్ని ఇప్పటికీ ఫ్రేమ్‌ కట్టి పూజిస్తున్నా. హనుమాన్‌ను పూజించడం వల్ల నాన్న కోరుకున్న చోటుకి ట్రాన్స్‌ఫర్‌ అవడంతో ఆయన కూడాభక్తి కలిగింది. భగవంతుడు బాహ్యంగా ఉండడు. మన అంతరాత్మలో ఉంటాడు. హనుమాన్‌ మనకు ఆశీస్సులు అందిస్తే జీవితాంతం వదలడు. మనల్ని నిరంతరం రక్షిస్తూ మార్గ నిర్దేశం చేస్తుంటాడు. ఆయనను పూజిస్తూ క్రమశిక్షణతో నిబద్ధతతో ఈస్థాయికి వచ్చాని భావిస్తాను. హను మాన్ టైటిల్ కూడా నా నుంచి వచ్చిందని చెప్పారు. 
 
ఓ ఇంట‌ర్వ్యూలో `మీకిష్టమైన సూప‌ర్ హీరో ఎవ‌రు.. ఐర‌న్ మానా, బ్యాట్ మేనా, సూపర్ మానా’ అని అడిగితే... మ‌న హ‌నుమంతుడు ఉండ‌గా మ‌రో సూప‌ర్ హీరో ఏమిట‌ని భావించి వెంటనే ‘హ‌ను -మాన్‌’ అన్నాను. అది నా మనసులో వచ్చిన మాట. ఆ మాట ఈ చిత్రానికి టైటిల్ కావాలని నిర్ణయించడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. ప్రశాంత్‌వర్మ విజన్, హీరో తేజ కష్టం వృథాపోవు. ఇది చాలా మంచి సీజన్. ఎన్ని సినిమాలు వచ్చినా సరే మన కంటెంట్ లో సత్తా వుంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. పెద్ద విజయం అందేలా చేస్తారు. అయితే ఇది పరీక్షాకాలం. వరుస సినిమాలు ఉన్నప్పుడు అనుకున్న థియేటర్‌లు లభించకపోవచ్చు. ఇవాళ కాకపోతే రేపు చూస్తారు. ఫస్ట్‌ షో కాకపోతే, సెకండ్‌ షో చూస్తారు. కంటెంట్‌ బాగుంటే, ప్రేక్షకుల మార్కులు పడతాయి.

వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు.. అన్నీ సినిమాలు ఆడాలి. వాటితో పాటు హను మాన్ చిత్రం ఆడాలి. పరిశ్రమ పచ్చగా వుండాలి. 2017లో నా 150, బాలకృష్ణ గారి సినిమాలు విడుదలైన సమయంలోనే దిల్ రాజు గారి శతమానంభవతి సినిమాని విడుదల చేశారు. ‘కొంచెం డీలే చేస్తే బావుటుంది కదా’ అని దిల్ రాజు గారికి చెబితే. మా సినిమా కంటెంట్ బావుటుంది సర్. పెద్ద సినిమాల మధ్యలో కూడా ఆడుతుంది' అని ధైర్యంగా చెప్పారు. ఆయన చెప్పినట్లే ఆ సినిమా చక్కగా ఆడింది. ఆ విధంగానే హనుమాన్ చిత్రం కూడా బాగా ఆడుతుందని కోరుకుంటున్నాను. అమృత అయ్యర్ కథానాయికగా నటిచింది. తనకి మంచి భవిష్యత్ వుండాలని కోరుకుంటున్నాను. వరలక్ష్మీ శరత్ కుమార్ చాలా పవర్ ఫుల్ పాత్రలతో అలరిస్తున్నారు. తనకి ఆల్ ది బెస్ట్. వినయ్ హాలీవుడ్ విలన్ లా కనిపిస్తున్నారు.

నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక అభినందనలు. కెమరామెన్, సంగీత దర్శకులు, టీం అందరికీ అభినందనలు. ఖచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఒక మంచి ప్రకటన నేను చేస్తే బావుటుందని దర్శక నిర్మాతలు చెప్పారు. అయోధ్య రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఈ సమయంలో ఈ చిత్రం రావడం ఒక శుభపరిణామం. హను మాన్ చిత్రం ఆడినన్ని రోజులు వచ్చే కలెక్షన్స్ లో ప్రతి టికెట్ పై  రూ.5 అయోధ్య రామమందిరానికి ఇవ్వాలని హనుమాన్ చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. ఇది చాలా గొప్ప నిర్ణయం. హనుమంతుని ఆశీస్సులు చిత్ర బృందానికి నిండుగా వుంటాయి. ఆ పుణ్యం దక్కుతుంది. అందరికీ వరమై ఈ చిత్రం విజయం సాధిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జై హనుమాన్’ అన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు