ఉత్తరాఖండ్ జలప్రళయంపై హీరో మహేష్ బాబు విచారం.. వారంతా...

సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (07:20 IST)
ఉత్తరాంఖండ్ రాష్ట్రంలో హిమాలయా పర్వతశ్రేణుల నుంచి ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడటంతో జలప్రళయం సంభవించింది. ఆ రాష్ట్రంలోని చమోలీ జిల్లా జోషిమఠ్‌లో ఆదివారం మంచు చరియలు విరిగిపడడంతో గంగానదికి ఉపనది అయిన ధౌలీగంగా నదికి వరద పోటెత్తింది. ఆ నదిపై నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు ధ్వంసమైంది. ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, సమీప ప్రజలు దాదాపు 100 మందికిపైగా గల్లంతయ్యారు.
 
సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఇండోటిబెటిన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) సహాయక చర్యలు చేపట్టారు. ప్రాజెక్టు టన్నెల్‌లో చిక్కుకున్న 16 మందిని రక్షించారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు పదిమంది మృతదేహాలు లభ్యమయ్యాయి. 
 
ఈ ఘటనపై టాలీవుడ్ హీరో మహేశ్‌బాబు స్పందించాడు. గల్లంతైన వారంతా క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశాడు. టన్నెల్‌లో చిక్కుకున్న వారంతా క్షేమంగా బయటపడాలని ఆకాంక్షించిన మహేశ్.. వారి గురించే ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నాడు. సహాయక చర్యలు చేపట్టి పలువురిని కాపాడిన జవాన్లకు సెల్యూట్ చేశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు