మీ రాజకీయాలు పక్కనబెట్టండి.. సినిమా సమస్యలు సాల్వ్ చేయండి.. నాని వినతి

ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (15:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆ రాష్ట్ర మంత్రులకు సినీ హీరో నాని ఓ విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏపీ ప్రభుత్వానికి ఉన్న రాజకీయాలు పక్కనబెట్టండి. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించండి అంటూ నాని తన ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. 
 
సాయిధరమ్ తేజ్ - దేవకట్టా కాంబోలో 'రిపబ్లిక్' సినిమా నిర్మించారు. ఈ చిత్రం వచ్చే నెల ఒకటో తేదీన విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రిర హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ, ఏపీ ప్రభుత్వానికి.. పలువురు మంత్రులకు సభా వేదికపై నుంచి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. 
 
మునుపెన్నడూ లేని విధంగా ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేసమయంలో ఇటీవల హీరో నాని ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడం, ఆయనపై పలువురు అసహనం వ్యక్తం చేయడాన్ని కూడా ప్రస్తావించారు. 
 
ఏపీలో థియేటర్లు మూతపడ్డాయి.. గత్యంతరం లేక హీరో నాని ఓటీటీ వైపు వెళ్లాడు. అప్పుడు థియేటర్ల యజమానులంతా ఆ అబ్బాయి మీద పడితే ఆయన ఏం చేస్తాడు? వెళ్లి వైసీపీ నాయకులతో మాట్లాడుకోండి. ఆ అబ్బాయి మీద పడటం వలన ప్రయోజనం ఏముంటుంది? ఇందులో ఆ అబ్బాయి తప్పేమి ఉంది? అంటూ పవన్ ప్రశ్నించారు. 
 
ఈ వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. దీనిపై హీరో నాని ఆదివారం స్పందించారు.. సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కరించండి అంటూ ఏపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ట్విట్టర్ వేదికగా నాని ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. 
 
'పవన్ కళ్యాణ్‌గారికి, ఏపి ప్రభుత్వం మధ్య రాజకీయ విభేదాలను పక్కన పెట్టండి. చిత్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించడానికి తక్షణం శ్రద్ధ తీసుకోవడం అవసరం. సినిమా పరిశ్రమ సభ్యుడిగా నేను వైఎస్ జగన్‌గారు, సంబంధిత మంత్రులను వినయంగా అభ్యర్థిస్తున్నాను. సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారంలో ఎటువంటి డిలే లేకుండా చూడండి' అంటూ ట్వీట్ చేశారు. అలాగే, తనకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్‌కు నేచురల్ స్టార్ నాని ధన్యవాదాలు చెప్పారు. 


 

Keeping aside the political differences between Pawan Kalyan sir and AP Government. The film industry issues addressed are genuine and needs immediate attention. Thank you @PawanKalyan sir.

— Nani (@NameisNani) September 26, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు