శ్రీకాంత్ కుమారుడు రోషన్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'నిర్మలా కాన్వెంట్'. ఈ చిత్రం ఈ నెల 16న విడుదలవుతుంది. ఈ చిత్రం విజయంపై గట్టి నమ్మకంతో వున్నామని శ్రీకాంత్ తెలియజేశాడు. నాకు క్రికెట్ అంటే ఇష్టం.. రోషన్‌ను క్రికెటర్ చేయాలనుకున్నా.. కానీ పరిస్థితులు ఇలా నటుడ్ని చేశాయని తెలిపారు. బుధవారం సాయంత్రం అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో ఆయన మాట్లాడారు. రోషన్ ఇష్టప్రకారమే సినిమాల్లోకి వచ్చాడు. అసలు తనను క్రికెటర్ చేయాలనేది నా కల. నేను కలలుకంటుండేవాడిని. బాగా ఆడతాడు.
అయితే.. దానికి సపోర్ట్ అవసరం.. క్రికెటర్‌గా.. తనతోపాటు ట్రావెల్ చేయాల్సి వుంది. కానీ.. షూటింగ్ బిజీవల్ల ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను. స్కూల్లో బాగా ఆడేవాడు. అండర్ క్రికెటర్ టోర్నీకి వెళ్ళే టైంలోనే 'రుద్రమదేవి'లో ఆఫర్ వచ్చింది. రానా చిన్నతనం పాత్ర చేశాడు. దానికి మంచి పేరు వచ్చాక.. తనకు అనుకోకుండా సినిమాలపై ఆసక్తి పెరిగిందని చెప్పారు.
ఇంకా మాట్లాడుతూ.. నేను షూటింగ్‌కు రెండేసార్లు వెళ్ళాను. టెన్షన్ పడటం చూడలేదు. మొదట్లో మూడురోజులు ఇబ్బంది పడ్డాడు. నాగార్జునగారి సన్నివేశాల్లో మరింత కంగారు పడ్డాడు. ఆయన తనతో కలిసిపోయేలా చేసుకోవడంతో రోషన్.. సీనియర్‌లా నటించేశాడు. ఏదిఏమైనా... తన కాళ్ళపై తాను నిలబడాలని ఎప్పుడూ చెబుతుంటాం. మేమంతా కష్టపడి పైకి వచ్చాం. మాకు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు.
అది దృష్టిలో పెట్టుకుని నడుచుకో అని హితబోధ చేస్తుంటాం. దాన్ని తూచ తప్పకుండా ఫాలో అవుతున్నాడు. ముందు ముందు పైస్థాయికి వెళ్లాలని.. హార్డ్ వర్క్ చేయాలని చెబుతుంటాను. తను అలాగే చేస్తుంటాడు. ఇక సినిమా కథ ప్యూర్ లవ్‌స్టోరీ. సెంటిమెంట్ సీన్లు బాగా చేశాడు. ఈ వయస్సులో చేయడం కష్టం.. అయినా బాగా చేశాడు. ఏది ఏమైనా.. ఈ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుంటాడు. ఈ గ్యాప్‌లో అన్నివిధాలా పట్టు సంపాదిస్తాడు. ముఖ్యంగా డాన్స్, ఫిట్‌నెస్‌తో పాటు నటుడిగా అన్నివిధాలా పర్‌ఫెక్ట్ అనేలా వస్తాడని చెప్పారు. ఇప్పటితరం హీరోలు ఫిట్‌నెస్, డాన్స్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. రోషన్ కూడా చూపిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ప్రభాకర్ కుమారులు కూడా నటించారు. వారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఊహ మాట్లాడుతూ.. 'రుద్రమదేవి' సినిమా తర్వాత రోషన్‌ను నటుడిగా ఆపేద్దామనుకున్నాం. అంతలోనే.. వయస్సుకు తగ్గ కథ రావడం.. నాగార్జున గారు ఇన్‌వాల్వ్ కావడంతో.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రోషన్‌ను నటింపజేశాం. తను చాలా ఇంట్రెస్ట్‌గా చేశాడు. ఈ రంగంలో అదృష్టం అనేది కీలకం. దాన్నిబట్టే ముందుముందు ఎలా ఎదుగుదాడనేది ఆధారపడి వుంటుందని పేర్కొన్నారు.
రోషన్ మాట్లాడుతూ... కష్టమైన సీన్లు వున్నప్పుడు అమ్మను నాన్నను అడిగాను.. సిట్యువేషన్ బట్టి ఫీలై ఒరిజినల్ లైఫ్‌లో ఎలా జరిగిందో అలా రియాక్ట్ కావాలని చెప్పేవారు. నా స్నేహితులు కూడా.. నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడనే కాకుండా మామూలుగా ట్రీట్ చేస్తున్నారు. నాన్నగారు కూడా నన్ను నటుడి కొడుకులా కాకుండా కామన్‌మేన్‌గా పెంచాడని తెలిపారు. నాకు అమ్మానాన్న స్పూర్తని వెల్లడించారు.