బెంగుళూరు నగరంలో ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ విద్యార్థిని లైంగికంగా వేధించిన కేసులో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సా రాష్ట్రంలో లెక్చరర్ వేధింపులు భరించలేక యువతి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెల్సిందే. ఈ ఘటన మరువకముందే ఇపుడు కర్నాటకలో మరో విద్యార్థినికి ఈ తరహా వేధింపులు ఎదురుకావడం గమనార్హం. దీంతో ప్రముఖ కళాశాలకు చెందిన ఇద్దరు లెక్చరర్లతో పాటు మరోవ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
బాధితురాలు మహిళా కమిషన్‌కు చేసిన ఫిర్యాదుతో మారతహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. చదువులో సహాయం చేస్తానని, కొన్ని నోట్స్ ఇస్తానని ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర బాధిత విద్యార్థినితో మాట్లాడటం ప్రారంభించారు. అది వారిద్దరి మధ్య పరిచయానికి దారితీసింది. తర్వాత నరేంద్ర తన స్నేహితుడు అనూప్ రూమ్ వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ వీడియోలు తన వద్ద ఉన్నాయని కొన్నిరోజులకు బయాలజీ లెక్చరర్ సందీప్ అత్యాచారానికి పాల్పడ్డాడని, తన రూమ్‌లోనే అత్యాచారం జరిగింది కాబట్టి.. ఆ క్లిప్‌లు తన వద్ద ఉన్నాయని బెదిరించి అనూప్ కూడా అఘాయిత్యం చేశాడని వాపోయింది.
వరుసగా జరిగిన ఈ ఘటనలతో కలత చెందిన విద్యార్థిని తన కుటుంబానికి ఈ విషయాన్ని చెప్పింది. దాంతో వారు మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇదిలావుంటే, లెక్చరర్ వేధింపులు భరించలేక గతవారం కాలేజీ ప్రాంగణంలోనే ఒంటికి నిప్పంటించుకున్న ఒడిశా యువతి.. చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి ప్రాణాలు విడిచింది. శరీరం తీవ్రంగా కాలిపోయిందని, ఆమెను కాపాడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదని భువనేశ్వర్ ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు.