అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో.. అదరగొట్టే ‘హై 5’, స‌క్స‌ెస్ ఇస్తుందా...?

శుక్రవారం, 8 నవంబరు 2019 (20:08 IST)
జీవితంలో డబ్బే ప్రధానం కాదు... కుటుంబం, సుఖసంతోషాలే ముఖ్యం అని తెలియజెప్పే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘హై 5’. రాధ క్యూబ్ బ్యానర్ పై అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్‌కు సమీపంలోని అలేఖ్య రిసార్ట్స్‌లో జరుగుతోంది. హీరోయిన్ మన్నార చోప్రాపై ఇక్కడ ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమా విశేషాలను నిర్మాత రాధరాజశేఖర్, ధర్శకుడు అమ్మ రాజశేఖర్ వివరించారు. ఈ సినిమాకు సంబంధించినంత వరకు ఇది ఆఖరి రోజు షూటింగ్ అని అమ్మ రాజశేఖర్ చెప్పారు. ఇంతకుముందు గోవా సమీపంలోని చిన్న దీవిలో సెట్ వేసి చిత్రీకరణ జరిపామని, మంచి మ్యూజికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోందని వివరించారు. 
 
గోపీచంద్‌తో ‘రణం’ తర్వాత మళ్లీ అంతటి వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చెప్పారు. తన భార్య నిర్మాతగా తనే సొంతంగా దీన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ‘ఈ సినిమాలో మొత్తం 12 పాటలు ఉంటాయి. ఐదుగురు సంగీత దర్శకులు ఈ సినిమాకు పని చేస్తున్నారు.
 
లండన్, మలేషియా, బోస్టన్‌లకు చెందిన ముగ్గురు మ్యూజిక్ డైరెక్టను దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. తమన్ ఒక పాట చేస్తున్నారు. దేవీశ్రీప్రసాద్‌తో ఒక పాట అనుకుంటున్నాము. రీరికార్డింగ్ ఒకరు చేస్తారు. పాటలతోనే కథ చెప్పేలా దీన్ని తెరకెక్కిస్తున్నాం. పాత సినిమాల్లో ఈ తరహాలో చిన్నచిన్న పాటలుండేవి. మాటల్ని పాటల్లా మార్చి నేటి తరానికి తగ్గట్టు పూర్తి వినోదభరితంగా రూపొందిస్తున్నాం. చిన్న మెసేజ్‌తో ఆసాంతం ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది’అని వివరించారు.
 
హీరో్యిన్ మన్నార చోప్రా మాట్లాడుతూ... మాంచి మసాలా పాటలతో ఈ సినిమా ఉంటుందని, ఇలాంటి సినిమా చేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరిందని చెప్పారు. తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని, ఈ సినిమాతో తన కోరిక నెరవేరిందని చెప్పారు. నిర్మాత రాధ రాజశేఖర్ మాట్లాడుతూ... జనవరిలో ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. నృత్య దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ అమ్మ రాజశేఖర్ వద్ద చాలా కాలం సహాయకుడిగా పనిచేసినట్లు చెప్పారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ సినిమాకు నృత్యరీతుల్ని సమకూరుస్తున్నట్లు వివరించారు. మంచి మసాలా డ్యాన్సులు ఇందులో ఉంటాయన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు