వివాదాలతో కాపురం చేసే రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా ఇక్కడ పరిచయం అక్కర్లేదు. సినిమాలతో సంచలనాలను సృష్టిస్తున్న ఆర్జీవీ మర్డర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ. అయితే ఈ సినిమా ను ఆపాలంటూ ప్రణయ్ భార్య అమృత, ప్రణయ్ తండ్రి బాలస్వామి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ప్రణయ్ తండ్రి బాలస్వామి నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపి వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో 'మర్డర్' చిత్ర దర్శకనిర్మాతలు బాలస్వామి వేసిన పిటీషన్ పై హైకోర్టులో స్టే కోరుతూ పిటీషన్ దాఖలు చేసారు. ఈ నేపథ్యంలో 'మర్డర్' సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
మర్డర్ సినిమాపై నల్గొండ కోర్టు ఇచ్చిన స్టేను హైకోర్టు కొట్టేసింది. అయితే సినిమాలో ప్రణయ్, అమృత పేర్లు వాడకూడదని షరతు విధించింది. దాంతో అమృత, ప్రణయ్ పేర్లు వాడమని చిత్ర యూనిట్ తెలిపింది. దాంతో వర్మ మర్డర్‌కు ఊరట లభించింది.