వాసుకీ మాట్లాడుతూ, నాకూ కుమార్తె వుంది. తను ఇంగ్లండ్ లో మెడిసిన్ చదువుతోంది. ఈ సినిమా ప్రివ్యూకు తీసుకువచ్చి చూపించాను. చాలా కనెక్ట్ అయింది. ఇప్పటి జనరేషన్ కు తగినట్లుగా వుందని కితాబిచ్చింది. సహజంగా మన పిల్లలు మనకు అన్నీ నిజాలు చెబుతారనుకోవడం చాలా తప్పు. అందులో అబద్దాలు కూడా వుంటాయి. పెండ్లి కాకముందు మా అమ్మ నా గురించి పలు జాగ్రత్తలు చెబుతుండేది. తేలిగ్గా తీసుకోవడమేకాదు విసుక్కునే దానిని. అప్పుడూ కొన్ని అబద్దాలు కూడా చెప్పాను. జనరేషన్ మారినా ఇప్పటి పిల్లలు చెప్పేదానిలో 90 శాతం అబద్దాలే వుంటుంది. ఇవి సినిమా చూస్తే ఎవరికి వారు కనెక్ట్ అవుతారు అని తెలిపింది.
సీనియర్ నరేష్ మాట్లాడుతూ, మా అమ్మగారు చిన్నతనంలో ఓ సందర్భంగా గట్టిగా తిట్టారు. దానితో బాగా కోపంతో ఆవేశంతో చనిపోదామని సైకిల్ తీసుకుని చాలా దూరంగా వెళ్ళాను. కానీ సాయంత్రానికి బాగా ఆకలేసింది. బయట ఎవరు భోజనం పెడతారు. దేవుడా.. అంటూ తిరిగి వెనక్కివచ్చా. అది తెలిశాక అమ్మ చంప చెళ్లుమనిపించింది. ఆ దెబ్బలే నా ఎదుగుదలకు దోహదపడ్డాయి. అయితే ఇప్పటి జనరేషన్ ను కొట్టడం కాదు. కనీసం మందలించినా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేపువారు పెద్దయ్యాక వారి పిల్లలు చేసే చేష్టలకు వారిలో పరివర్తన వస్తుందో చూడాలి. పిల్లలు, పెద్దలు అనేది జీవితంలో సైకిల్ లాంటిది అని చెప్పారు.