శ్రీరెడ్డి పేరు చెబితే టాలీవుడ్, కోలీవుడ్ గరంగరం అవుతాయి. కానీ కొంతమంది మాత్రం శ్రీరెడ్డిని బ్రహ్మాండంగా వెనకేసుకుని వస్తున్నారు. ఇపుడు ఈ జాబితాలో కోలీవుడ్ నటి, నిర్మాత కుట్టి పద్మిని కూడా చేరిపోయారు. శ్రీరెడ్డితో తను కలిసి పని చేయాలనుకుంటున్నట్లు తెలిపిన ఆమె తను నిర్మించే ధారావాహికల్లో మంచి పాత్రలు ఇస్తానని వెల్లడించారు.
శ్రీరెడ్డి చేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ సినీ ఇండస్ట్రీలో నూటికి నూరు శాతం వున్నదనీ, 1980ల నుంచే ఈ వ్యవహారం సినీ ఇండస్ట్రీల్లో సాగుతూ వస్తోందని చెప్పుకొచ్చారు. నడిగర్ సంఘంలో ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా వున్న పద్మిని ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నటుడు విశాల్‌కు షాక్ ఇచ్చినట్లయింది. ఎందుకంటే గతంలో శ్రీరెడ్డి వాదన సరైంది కాదనీ, ఎవరైనా క్యాస్టింగ్ కౌచ్‌కు పాల్పడితే పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయాలి కానీ ఇండస్ట్రీలోని వారిపై ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించాడు. ఐతే ఇప్పుడు శ్రీరెడ్డికి నడిగర్ సంఘంలోని సభ్యురాలి నుంచి మద్దతు లభించడం గమనార్హం.