భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైపోతోంది. ఈ రాష్ట్రంలో కుండపోతవర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలో వందలకొద్దీ రహదారులు మూసుకునిపోయాయి. వెయ్యికిపై విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అనేక చోట్ల మెరుపు వరదలు, కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో తరచూ ప్రధాన మార్గాలు మూత పడుతున్నాయి. కులూలోని లార్జీసోంజ్ మార్గంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 15 పంచాయతీలకు ఈ రోడ్డుతో సంబంధాలు కూడా తెగిపోయాయి.
వీటిల్లో జాతీయరహదారులు కూడా ఉన్నాయి. విద్యుత్తు సరఫరా వ్యవస్థ చాలాచోట్ల దెబ్బతింది. వీటిల్లో కులూలో అత్యధికంగా 557 విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం అయ్యాయి. మండీలో 385 పనిచేయడం లేదు. జూన్ 20 నుంచి రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ప్రమాదాల వల్ల 261 మంది ప్రాణాలు కోల్పోయారు.
బంగాళాఖాతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒరిస్సాలో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణశాఖ పేర్కొంది. ఇక దేశంలోని పశ్చిమ, మధ్య భాగాల్లో భారీగా వానలు కురిసే అవకాశం ఉంది. గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లలో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేసింది. ఉత్తర భారత్‌లోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లో అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.
జమ్మూకాశ్మీర్‌లో ఆదివారం మరోసారి మేఘ విస్ఫోటం(క్లౌడ్ బరస్ట్) విలయం సృష్టించింది. రాత్రంతా కురిసిన వర్షానికి కఠువా జిల్లాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కిశ్త్‌వాడ్ జిల్లాలోని చశోతీలో వరదలు బీభత్సం సృష్టించి మూడు రోజులు కూడా గడవకముందే మరోసారి మేఘ విస్ఫోటం చోటుచేసుకోవడం గమనార్హం.