భర్త చచ్చిపోయి ఏడుస్తుంటే, నేను పెళ్లి చేసుకుంటానంటాడు; ఇదే చావుకబురు అంటే!
బుధవారం, 17 మార్చి 2021 (15:29 IST)
Lavanya, kartikeya, alluarvind
దర్శకుడు ఒక కథ రాసుకొని మీకు చావు కబురు చల్లగా అని ఒక కథ చెబుతాను అన్నాడు. ఎవరైనా చావు కబురు చల్లగా చెబుతారా! కానీ దర్శకుడు ఈ సినిమాలో ఆ టైటిల్ కు న్యాయం చేశాడు. కథలో తీయడానికి ఏంలేదు. భర్త చచ్చిపోయి హీరోయిన్ ఏడుస్తుంటే కార్తికేయ వెళ్లి మీ ఆయన ఎలాగూ లేడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు.
ఇలాంటి విచిత్రమైన కథ అనేక మలుపులు తిరుగుతూ చావు కబురు చల్లగా సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు కౌశిక్. కథ క్లైమాక్స్ కి వచ్చేసరికి హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే బాగుండు అని ప్రేక్షకులతో అనిపించేలా తెరకెక్కించాడు దర్శకుడు` అని చిత్ర సమర్పకుడు, మెగా నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. విశాఖలో ఉల్లాసంగా ఉత్సాహంగా చావు కబురు చల్లాగా జరిగిన గ్రాండ్ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు.
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా కొత్త దర్శకుడు కౌశిక్ తెరకెక్కించిన చావుకబురు చల్లగా సినిమా మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా వైజాగ్ లో గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ చేశారు దర్శక నిర్మాతలు. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇంకా అల్లు అరవింద్ మాట్లాడుతూ, "సరైనోడు, గీత గోవిందం దగ్గర నుంచి `అల వైకుంఠపురం` దాకా అన్నీ వేడుకలు వైజాగ్లో జరిపాం. ఈ ఊరితో ఉన్న అనుబంధం అలాంటిది. ఎందుకంటే కొత్త కథలను కొత్త ఆలోచనలు ఆదరించే అలవాటు మీ అందరికీ ఉంది. లావణ్య ఈ సినిమాలో గ్లామర్ తక్కువగా ఉండే పాత్ర చేసింది. ఒక మంచి సినిమా తీశాం. మీరందరూ థియేటర్లకి వచ్చి చూడండి అని తెలిపారు.
దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ, "ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాము. కార్తికేయలో మరో కోణాన్ని మీరు అందరూ చూస్తారు. అందరి కళ్ళు ఆయన మీదకి లాగేసుకున్నాడు. మల్లికా క్యారెక్టర్ చేయడం అంత ఈజీ కాదు. ఏమాత్రం తేడా జరిగినా సినిమా అవుట్. అలాంటిది నువ్వు చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేశావు లావణ్య. సినిమాలో నటించిన వాళ్లందరికీ, సాంకేతిక నిపుణులు అందరికీ థాంక్యూ" అని తెలిపారు.
హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. " మల్లిక క్యారెక్టర్ నా కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్. చావు కబురు చల్లగా సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి అద్భుతమైన కథ నాకు చెప్పినందుకు కౌశిక్ కు థాంక్స్. కార్తికేయ చాలా బాగా నటించాడు. మార్చ్ 19న అందరూ థియేటర్ లకి వచ్చి మా సినిమాను ఆదరించండి.." అని తెలిపారు.
హీరో కార్తికేయ మాట్లాడుతూ, "ఎన్ని రోజులు ఆర్ఎక్స్ 100 హీరోగా గుర్తు పెట్టుకున్నారు. ఇకపై బస్తీ బాలరాజు పాత్ర లో నన్ను గుర్తు పెట్టుకుంటారు. ఈ సినిమాను నిర్మించిన గీత ఆర్ట్స్ చాలామంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో లావణ్య తప్ప మేము అందరం దాదాపు కొత్త వాళ్ళం. ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే నిర్మాత బన్నీ వాసు గారు దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమాపై చాలా మంచి బజ్ క్రియేట్ అయింది. ఆర్ ఎక్స్ 100 తర్వాత దాన్ని మించి హిట్ కొట్టే అవకాశం ఇన్నాళ్లకు దొరికింది. కుటుంబ సమేతంగా థియేటర్ లో కూర్చుని మా సినిమాను ఎంజాయ్ చేయండి.." అని తెలిపారు.