రాంగోపాల్ వర్మ స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ తీస్తారన్న దగ్గర్నుంచి అటు అభిమానులు, ఇటు సెలబ్రిటీలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి బయోపిక్ తీయడం వేస్ట్ అన్నారు. ఎన్టీఆర్ ఎవరెస్ట్ శిఖరం అనీ, అలాంటి ఆయనలో మచ్చలు చూపించే ప్రయత్నం చేస్తే ఆయన అభిమానులు, ప్రజలు చెప్పులతో కొడతారని హెచ్చిరంచారు. అంతేకాకుండా అసలు ఆ సబ్జెక్టును టచ్ చేయకపోవడమే బెటర్ అని సూచన చేశారు.
ఒకవేళ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తూ ఆ చిత్రంలో తనను నటించమని అడిగితే రోజుకి కోటి రూపాయలిచ్చినా అందులో చచ్చినా నటించనన్నారు. అసలు బయోపిక్ అంటే ఆయన జీవితమంతా తీయాలి. అవన్నీ తీసే సాహసం వర్మకు వుందా అని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి రాకముందు వరకూ తీసుకుంటే ఫర్వాలేదు కానీ ఆ తర్వాత తీస్తే చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వుంటుందన్నారు.