తల్లి మనసు లాంటి చిత్రాలను ఆదరిస్తే మరిన్ని వస్తాయి: ముత్యాల సుబ్బయ్య

డీవీ

శనివారం, 18 జనవరి 2025 (16:55 IST)
Mutyala Subbaiah, Rachita Mahalakshmi, Sippy, Mutyala Anant Kishore
రచిత మహాలక్ష్మి,  కమల్ కామరాజు,  సాత్విక్,  సాహిత్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన  చిత్రం "తల్లి మనసు". పూర్వాశ్రమంలో పలువురు ప్రముఖ దర్శకుల వద్ద  దర్శకత్వ శాఖలో పనిచేసి, అనుభవం గడించిన వి.శ్రీనివాస్  (సిప్పీ)  దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మాతగా మారి, నిర్మించిన చిత్రమిది.
 
ఇటీవలనే  సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 24న థియేటర్లలో విడుదల చేస్తున్నామని హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిర్మాత ముత్యాల అనంత కిషోర్  తెలియజేశారు. 
 
చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, "దర్శకుడిగా 50 చిత్రాలు తీశాను. అయితే సొంత చిత్ర నిర్మాణం మునుపు ఎన్నడూ చేయలేదు. మా పెద్ద అబ్బాయి అనంత కిషోర్ నిర్మాతగా ఓ మంచి చిత్రం తీయాలన్న అభిరుచి మేరకు ఈ సినిమాను సొంతగా నిర్మించాం. తల్లికి ఎన్ని నిర్వచనాలు ఇచ్చినా సరిపోవు. అలాంటి తల్లి సబ్జెక్టును తీసుకుని, పాత్రలకు తగ్గ నటీనటులనే ఎంచుకుని ఈ సినిమాను తీశాం. చూస్తున్న ప్రేక్షకులు కథలో, పాత్రలలో పూర్తిగా నిమగ్నమయ్యేవిధంగా సినిమా వచ్చింది. ఇలాంటి మంచి చిత్రాలను ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి" అని అన్నారు. 
 
 ప్రధాన పాత్రధారిణి రచిత మహాలక్ష్మి మాట్లాడుతూ, "ఇందులో నేను చేసిన తల్లి పాత్రకు కొందరు ప్రముఖ హీరోయిన్లను నిర్మాత, దర్శకులు సంప్రదించినపుడు కొడుకు పాత్ర ఉన్నందువల్ల తాము చేయమని చెప్పారట. ఈ నేపథ్యంలో ఆ అవకాశం నాకు లభించడం అదృష్టం. ఎందుకంటే మంచి నటనను ప్రదర్శించే అవకాశంతో పాటు నా కెరీర్ అంతా గుర్తుండిపోయే పాత్ర" అని అన్నారు. 
 
 దర్శకుడు వి.శ్రీనివాస్  (సిప్పీ) మాట్లాడుతూ, "ఓ తల్లి  ఎలాంటి సంఘర్షణలకు గురయ్యిందన్న అంశాన్ని ప్రేక్షకులకు హత్తుకునేలా వైవిధ్యముగా చెప్పాం. భావోద్వేగం, సెంటిమెంట్, ఎంటర్ టైన్మెంట్ వంటి అంశాల మేళవింపుతో చిత్రం ఉంటుంది. నిర్మాత అభిరుచి లేకపోతే ఇంత మంచి చిత్రం రాదు" అని చెప్పారు. 
ఇంకా హీరోలు కమల్ కామరాజు, సాత్విక్ వర్మ, నటులు దేవీప్రసాద్, జబర్దస్త్ ఫణి, రచయిత నివాస్, డీవోపీ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొని, ప్రేక్షకులు తప్పనిసరిగా చూసి తీరాల్సిన చిత్రమిదని, ఇలాంటి చిత్రానికి పనిచేసిన అనుభూతి ఎప్పటికీ మిగిలిపోతుందని అభివర్ణించారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో , రఘుబాబు, శుభలేఖ సుధాకర్, సాహిత్య, వైష్ణవి, దేవిప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, శాంతకుమార్, గౌతం రాజు, దేవిశ్రీ, తదితరులు తారాగణం. 
 
ఈ చిత్రానికి మూల కథ: శరవణన్, కదా విస్తరణ: ముత్యాల సుబ్బయ్య, మరుధూరి రాజా, మాటలు: నివాస్, పాటలు: భువనచంద్ర, సంగీతం: కోటి, డి.ఓ.పి: ఎన్.సుధాకర్ రెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, ఆర్ట్: వెంకటేశ్వరరావు, 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు