బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన బాలీవుడ్ నటి రియా చక్రవర్తి... చివరకు డ్రగ్స్ కేసులో అరెస్టు అయింది. ఆమె వద్ద విచారణ జరిపిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేక కీలక ఆధారాలను సేకరించి, ఆ తర్వాత అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆమె బైకుల్లా జైలులో ఉంది. అయితే ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది.
ఈ సందర్భంగా రియా తరపు న్యాయవాది వాదిస్తూ, రియా వద్ద కొంత మొత్తంలో గంజాయి మాత్రమే ఉందని... బెయిల్ పొందడానికి ఆమె అర్హురాలని వాదించారు. ఈ వాదనను జడ్జి ఖండించారు. ప్రాసిక్యూషన్ ఆరోపణల ప్రకారం డ్రగ్ ట్రాఫికింగ్‌లో రియా ఉందని చెప్పారు.
సుశాంత్ డ్రగ్స్‌కు రియా డబ్బు చెల్లించిందని తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టెన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం ప్రకారం ఇది నాన్ బెయిలబుల్ కేసు అని, సెక్షన్ 27-ఏ కింద ఆమె శిక్షార్హురాలని స్పష్టం చేశారు.
అంటే, ఈ ఎన్డీపీఎస్ సెక్షన్ 27-ఏ కింద ఎవరైనా ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కానీ డ్రగ్స్ ఫైనాన్సింగ్‌లో ఉన్నట్టైతే వారికి 10 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఇదేసమయంలో రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. సో.. రియా చక్రవర్తికి ఖచ్చితంగా ఈ కేసులో జైలుశిక్ష పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.