బుట్ట బొమ్మ సినిమాలో కథే హీరో: సిద్ధు జొన్నలగడ్డ

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (12:42 IST)
Butta Bomma pre release
గతేడాది 'డీజే టిల్లు', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలతో ఘన విజయాలను అందుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ ఏడాదిని కూడా అంతే ఘనంగా ప్రారంభించబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మించిన రొమాంటిక్ థ్రిల్లర్ 'బుట్ట బొమ్మ'. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.  సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో దర్శకులు మారుతి, సంపత్ నంది, శైలేశ్ కొలను, అనుదీప్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
 
సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ, ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. సితార అనేది నాకు హోమ్ బ్యానర్ లాంటిది. వాళ్ళ సినిమా అంటే నా సినిమా లాంటిదే. బుట్టబొమ్మ గురించి చెప్పాలంటే కథే ఈ సినిమా హీరో. ఈ సినిమా ఎంత సాఫ్ట్ గా ఉంటుందో, అంతే వైల్డ్ గా ఉంటుంది. అసలు ఈ సినిమా నేను చేయాలి.. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఈ సినిమా చూశాక 'అట్లుంటది మనతోని' అని ఈ సినిమా అంటుంది మీతో. ఈ సినిమా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి.. ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది. టీజర్, ట్రైలర్ చూస్తుంటేనే దర్శకుడు రమేష్ ఈ సినిమాని అద్భుతంగా రూపొందించారని అర్థమవుతుంది. అనిఖా, సూర్య, అర్జున్ దాస్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. సితార నుంచి వస్తున్న మరో మంచి సినిమా ఇది. డీజే టిల్లు చూసినవాళ్లు అందరూ ఈ సినిమా కూడా చూసి ఆదరించండి. చాలా బాగుంటుంది." అన్నారు.
 
చిత్ర దర్శకుడు రమేష్ మాట్లాడుతూ, ఈ సినిమా కోసం వంశీ గారు నాకు మంచి నటీనటులను, గొప్ప టెక్నిషియన్స్ ని ఇచ్చారు. గోపిసుందర్, స్వీకర్ అద్భుతమైన సంగీతం అందించారు. డీవోపీ వంశీ  విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూసి త్రివిక్రమ్ గారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. సుకుమార్ గారితో కలిసి చాలాకాలం పనిచేశాను. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆ అనుభవంతోనే ఈ సినిమా కోసం శాయశక్తులా కష్టపడ్డాను. థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూడండి. మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది." అన్నారు.
 
అనిఖా సురేంద్రన్ మాట్లాడుతూ.. "నాకు ఇంతమంచి అవకాశమిచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్ కి, నాగవంశీ గారికి, దర్శకుడు రమేష్ గారికి ధన్యవాదాలు. సూర్య, అర్జున్ దాస్ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు.
 
సూర్య మాట్లాడుతూ, రెండున్నరేళ్ల క్రితం మా నాన్నగారు ఈ సినిమా మలయాళ వెర్షన్ చూపించి.. ఈ ఆటో డ్రైవర్ పాత్ర నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు. త్రివిక్రమ్ గారు, చినబాబు గారు, వంశీ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. రమేష్ గారి దర్శకత్వంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా తర్వాత దర్శకుడిగా ఆయనకు ఎన్నో అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను" అన్నారు.
 
ఇంకా దర్శకులు మారుతి, సంపత్ నంది, శైలేశ్ కొలను, అనుదీప్ మాట్లాడుతూ.. "నాగవంశీ గారి కథల ఎంపిక చాలా బాగుంటుంది. ఈ చిత్రంతో ఆయన మరో విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నామని" అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు