తెలుగు చిత్రపరిశ్రమకు ప్రముఖ సినీ నిర్మాతల గృహాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గత మూడు రోజులుగా చేపట్టిన తనిఖీలు శుక్రవారంతో ముగిశాయి. హైదరాబాద్ నగరంలో మొత్తం 16 చోట్ల 55 అధికారుల బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, నవీన్ ఎర్నేని, రవిశంకర్‌లతో పాటు.. సినీ దర్శక నిర్మాత సుకుమార్, పలువురు సినీ ఫైనాన్షియర్ల నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి.
సినీ నిర్మాతలకు భారీ మొత్తంలో డబ్బులు సమకూర్చే ఫైనాన్షియర్లు సత్య రంగయ్య, నెక్కింటి శ్రీధర్, నెల్లూరు ప్రతాప్ రెడ్డి గృహాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలే టార్గెట్‌గా ఈ సోదాలు నిర్వహించారు. దీంతోపాటు 'పుష్ప 2' సినిమా కలెక్షన్స్ వ్యవహారంపై ఆరాలు తీశారు. ఈ సందర్భంగా భారీగా నిధుల గోల్మాల్ అయినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తున్నది. అయితే, ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐటీ అధికారులు వెల్లడించాల్సివుంది.
మరోవైపు, ఈ ఐటీ దాడులపై హీరో విక్టరీ వెంకటేష్ వద్ద ప్రస్తావించగా, ఐటీ రైడ్స్ జరుగుతున్నాయా? నిజమా? ఆ విషయం నాకు తెలియదు. మిగతా వాళ్ల విషయాన్ని పక్కనపెడితే.. నేను పారితోషికం మొత్తం వైట్‌లోనే తీసుకుంటా. నేను వైట్ వైట్. నా రెమ్యునరేషన్ కూడా తక్కువే కదా అని చాలా కూల్‌గా సమాధానమిచ్చారు.