తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్, సినీ నటి సమంత సెలెక్ట్ చేసిన చీరల్లోనే ఓ చీరను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తెను అందించనున్నారు. ఇవాంకాకు అందించే కానుకల జాబితాలో గొల్లభామ చీర కూడా వుంది. సిద్ధిపేటలో ఈ చీరల తయారీ జరుగుతోంది. చేనేత దుస్తులను తెలంగాణ సర్కారు ప్రోత్సహిస్తోంది.
ఇందుకోసం సినీనటి.. అక్కినేని నాగార్జున కోడలు సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా చీఫ్ ట్రంప్ కుమార్తె హైదరాబాద్ రాకను పురస్కరించుకుని.. హైదరాబాద్ నగరం అందంగా ముస్తాబైంది. మరోవైపు సిద్ధిపేట నుంచి గొల్లచీర కానుక కూడా సిద్ధమైంది. ఇవాంక కోసం సమంతనే కొన్ని చీరల డిజైన్లను సెలెక్ట్ చేసింది. సమంత సెలెక్ట్ చేసిన డిజైన్ల నుంచే ఇవాంకకు కానుకగా ఇచ్చే చీరను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఇకపోతే.. ఇవాంకా రాక కోసం భాగ్యనగరం ఎదురుచూస్తోంది. ఆమె రాకను పురస్కరించుకుని మాదాపూర్, మరికొన్ని ప్రాంతాలు అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్నాయి. చార్మినార్ వద్ద ఏకంగా ఓ మాల్‌నే ఏర్పాటు చేశారు. రోడ్లపై బిచ్చగాళ్లను చూసి ఏమనుకుంటుందో అనే అనుమానంతో కనిపించిన ప్రతి బిచ్చగాడినీ జైలుకు పంపించారు.