జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

దేవీ

మంగళవారం, 13 మే 2025 (18:18 IST)
Ajay Devgn, Yug Devgn
సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నుంచి భారీ అప్‌డేట్. హాలీవుడ్ క్లాసిక్ సిరీస్‌కు చెందిన ‘కరాటే కిడ్: లెజెండ్స్’ ఇప్పుడు కొత్త ఒరవడిలో భారత్‌లో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ తన కుమారుడు యుగ్ దేవగన్తో కలిసి ఈ చిత్ర హిందీ డబ్బింగ్ వెర్షన్‌లో పని చేశారు.
 
అజయ్ దేవగన్ జాకీ చాన్ పోషించిన మిస్టర్ హాన్ పాత్రకు గొంతు అందించగా, యుగ్ బెన్ వాంగ్ పోషించిన కథానాయకుడు లీ ఫాంగ్ పాత్రను డబ్బింగ్ చేశాడు. ఇది అజయ్ దేవగన్‌కి తొలిసారి ఇంటర్నేషనల్ సినిమా డబ్బింగ్ చేయడం కాగా, యుగ్‌కి ఇది డబ్బింగ్‌లో గ్రాండ్ ఎంట్రీ.
 
సినిమా కథలో గురువు-శిష్య బంధం ప్రధానాంశంగా ఉండగా, ఆ బంధం వెనుక నిజ జీవిత తండ్రీ-కొడుకుల కెమిస్ట్రీ ఉండడం ఈ వెర్షన్‌కు స్పెషల్ టచ్ ఇస్తోంది. యువతకు స్ఫూర్తినిచ్చే ఈ యాక్షన్ డ్రామా న్యూయార్క్ నేపథ్యంలో సాగుతుంది. షిఫ్ట్ అయిన స్కూల్, కొత్త స్నేహాలు, గొడవలు, శిక్షణతో కూడిన ప్రయాణం — ఇవన్నీ కలిపి లీ ఫాంగ్ జీవితంలో కొత్త మలుపులు తిప్పుతాయి.
 
‘కరాటే కిడ్: లెజెండ్స్’ సినిమా మే 30, 2025 న దేశవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఇండియన్ డబ్బింగ్ వెర్షన్‌కి అజయ్-యుగ్ కలయిక మరింత బలాన్ని అందించనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు