జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్‌బాస్ షో అధికారిక ప్రకటన వచ్చేసింది. కన్ను కొట్టి మరీ బుల్లితెరపై ఓ కన్నేశానని ఎన్టీఆర్ కన్ఫర్మ్ చేసినట్టుగా ఉన్న పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ‘స్టార్ మా’లో ప్రసారం కానున్న ‘బిగ్ బాస్’ షోకి ఎన్టీఆర్ హోస్ట్ (వ్యాఖ్యాత)గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. అందులో ఈ లుక్‌తోనే కనిపించనున్నారు. దీనిపై ఎన్టీఆర్ మాట్లాడుతూ, ‘‘ప్రేక్షకులకు బుల్లితెర (టీవీ) అనేది ఓ భారీ వినోద మాధ్యమం. ‘బిగ్ బాస్’ గురించి ‘స్టార్ మా’ వాళ్లు సంప్రదించినప్పుడు ఆసక్తిగా, సవాల్‌గా అన్పించింది. ఈ షో తప్పకుండా గేమ్ చేంజర్ అవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు.
ఈ షో కాన్సెప్ట్ ఏంటంటే... ఓ స్పెషల్ హౌస్‌లో సుమారు పన్నెండు మంది సెలబ్రిటీలను పెట్టి తాళం వేస్తారు. బయట ప్రపంచంతో వాళ్లకు సంబంధం ఉండదు. నో టీవీ, నో ఫోన్, నో పేపర్! అప్పుడు.. ఆ ఇంట్లో... వాళ్లు ఎలా ఉన్నారనేది రికార్డు చేసి టీవీలో టెలికాస్ట్ చేస్తారు. సౌతిండియాలో ఓ యంగ్ హీరో ఇలాంటి టీవీ షో చేయనుండడం ఇదే తొలిసారి. హిందీలో సల్మాన్‌ఖాన్ హోస్ట్ చేసిన ఈ ‘బిగ్ బాస్’ షోను తమిళంలో కమల్ హాసన్, కన్నడలో ‘ఈగ’ ఫేమ్ సుదీప్ చేస్తున్నారు. ‘స్టార్ మా’ బిజినెస్ హెడ్ అలోక్ జైన్ మాట్లాడుతూ – ‘‘తెలుగు ప్రజల మనోభావాలను, విలువలను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండేలా ఈ షోను ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
కాగా ఆ షోకు గానూ తారక్ రూ.9 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడంటూ అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఎపిసోడ్ ప్రకారం తారక్‌కు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. తొలి సీజన్లో భాగంగా 13 ఎపిసోడ్లను ప్రసారం చేయనున్నారు. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.50 లక్షల చొప్పున.. 13 ఎపిసోడ్లకు రూ.6.5 కోట్లు ఎన్టీఆర్ జేబులో పడుతున్నట్టు తెలుస్తోంది. తెలుగులో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న వారిలో.. అత్యధిక పారితోషికం అందుకోబోతున్న హోస్ట్‌గా తారక్ నిలవబోతున్నాడు. ప్రతి శనివారం ఈ ప్రోగ్రాం ప్రసారం కాబోతోంది.