అమ్మ ఆస్పత్రిలో ఉన్నారు.. నాకు పుట్టినరోజు వేడుకలు వద్దే వద్దు: కమల్ హాసన్

సోమవారం, 24 అక్టోబరు 2016 (20:10 IST)
తమిళనాడు సీఎం జయలలిత ఆస్పత్రిలో నెలపాటు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమెకు లండన్ వైద్యుడు రిచర్డ్ నేతృత్వంలోని వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను డిశ్చార్జ్ చేయాలా? వద్దా? అనేది తేల్చేందుకు రిచర్డ్ చెన్నైకి వచ్చారు.

అమ్మ ఆరోగ్యంపై అభిమానులు, కార్యకర్తలు, ప్రజల మధ్య ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనెల రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో జయమ్మ చికిత్స పొందుతున్న తరుణంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన అవసరం లేదని సినీ లెజెండ్ కమల్ హాసన్ నిర్ణయించుకున్నారు. 
 
తాజాగా విశ్వరూపం యాక్టర్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ.. వ‌చ్చేనెల‌ 7న తన పుట్టినరోజు వేడుకలను జ‌ర‌ప‌కూడ‌ద‌ని అభిమానులను కోరారు. ప్ర‌స్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ‘శభాష్‌ నాయుడు’ మూవీ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉంటున్న ఆయన అమ్మ అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్న తరుణంలో తన పుట్టిన రోజు వేడుకలు అనవసరమని కమల్ చెప్పుకొచ్చారు.
 
కాగా 1954వ సంవత్సరంలో జన్మించిన కమల్ హాసన్ తన 63వ ఏట అడుగెట్టనున్న సంగతి తెలిసిందే. నవంబర్‌లో పుట్టిన రోజు వేడుకలు జరిపేందుకు సిద్ధమవుతున్న తన ఫ్యాన్స్ క్లబ్‌కు జయలలిత ఆస్పత్రిలో ఉన్న తరుణంలో వేడుకలు జరపడం సబబు కాదన్నారు. ఇటీవల కాలికి ఏర్పడిన గాయంతో కమల్ హాసన్ ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి