విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం మంచిది కాదు : కమల్ హాసన్

సోమవారం, 23 జనవరి 2017 (15:21 IST)
జల్లికట్టు క్రీడా పోటీల కోసం శాశ్వత పరిష్కారం కనుగొనాలని డిమాండ్ చేస్తూ మెరీనా తీరంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేసి బలప్రయోగం చేయడాన్ని ప్రముఖ నటుడు కమల్ హాసన్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలు మంచి ఫలితాన్ని ఇవ్వవని పేర్కొన్నారు. 
 
గతవారం రోజులుగా అహింసాయుత మార్గంలో కొనసాగిన ఆందోళన సోమవారం ఒక్కసారి ఉద్రిక్తతకుదారితీసిన విషయం తెల్సిందే. దీంతో చెన్నై మహానగరం రణరంగాన్ని తలపించింది. నగర ప్రజలంతా రోడ్లపైకి వచ్చి పోలీసుల చర్యకు నిరసనగా రోడ్డురోకోలకు దిగారు. దీంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. దీనిపై కమల్ హాసన్‌తో పాటు.. పలువురు ప్రముఖులు తమ స్పందనను తెలిపారు. 
 
'ఇది పొరపాటు. విద్యార్థుల సత్యాగ్రహంపై పోలీసుల దౌర్జన్యం మంచి ఫలితాన్ని ఇవ్వదు' అని కమల్‌హాసన్‌ ట్వీట్‌ చేశారు. అలాగా సీనియర్ నటుడు సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ ట్వీట్ చేస్తూ 'ప్రియమైన తమిళనాడు పోలీసులారా. ఆందోళనకారులపై దౌర్జన్యం చేసి ఇన్నాళ్లూ మీరు సంపాదించుకున్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. ఇది తప్పు!' అని పేర్కొన్నారు. 'శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం హింస. ఇక్కడ అహింసకు గౌరవం లేదు, ఇది మా విషాదగాథ' అని గౌతమి ట్వీట్‌ చేశారు.
 
ఇదిలావుండగా, ఈనెల 26వ తేదీన రిపబ్లిక్‌ డే పరేడ్‌ను ఇక్కడ నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసమే పోలీసులు బలవంతంగా ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపి... మెరీనా ప్రాంగణాన్ని బలవంతంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ఆందోళనకారులు తమ డిమాండ్లు నెరవేరకుండా అక్కడి నుంచి కదిలేది లేదని తెగేసి చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి