సుశాంత్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసు దర్యాప్తుపై నమ్మకం లేదనీ, ముంబై మహానగరం కాస్త పాక్ ఆక్రమిత కాశ్మీర్‌గా మారిపోయిందంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు వివాదానికి ఆజ్యం పోశాయి. ఈ వ్యాఖ్యలతో ప్రతీకారేచ్ఛతో రగిలిగిపోయిన శివసేన... బాంద్రాలోని కంగనా రనౌత్ సినిమా కార్యాలయాన్ని కూల్చివేయించింది.
ఈ చర్యపై కంగనా రనౌత్ మండిపడింది. 'మీ తండ్రిగారి మంచి పనులు మీకు సంపదను ఇస్తాయేమో.. మంచి పేరును మాత్రం మీరే సంపాదించుకోవాలి. మీరు నా గొంతు నొక్కితే.. కోట్లాది గొంతుకలుగా అది ప్రతిధ్వనిస్తుంది. మీరు ఎన్ని నోళ్లు మూయగలరు? ఎంతమందిని అణిచివేయగలరు? నిజాలకు దూరంగా పారిపోయే మీరు రాచరిక పాలనకు సరైన ఉదాహరణ. అధికారం కోసం శివసేనను సోనియా సేనగా మార్చేశారు. నా వెంట నిలుస్తున్న కోట్లాది మందికి నా ధన్యవాదాలు. ఎంతోమంది మరాఠీ స్నేహితులు నాకు ఫోన్ చేసి మరీ కన్నీళ్లు పెట్టుకున్నారు. మహారాష్ట్ర సంస్కృతిని ప్రభుత్వం సిగ్గుమాలిన చర్యలతో మంట కలపొద్దు' అని కంగన మండిపడ్డారు.