దాదాపు దశాబ్దకాలం తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ చేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోగా, కలెక్షన్లపరంగా దూసుకెళుతోంది. అయితే, ఈ చిత్ర నిర్మాణం కోసం పెట్టిన పెట్టుబడి అంతా చిత్రం విడుదలైన మొదటిరోజునే (జనవరి 11వ తేదీనే) వచ్చినట్టు చిత్ర యూనిట్ వర్గాల సమాచారం.
ఈ సినిమా మొదటి షో నుండే మంచి రెస్పాన్సుతో కలెక్షన్ల పరంగా పాత రికార్డుల్ని కొల్లగొట్టి సినీ చరిత్రలో సంచలనాలను తెరలేపుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌లో కూడా ఖైదీ 150 ప్రీమియర్ కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో వసూలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజున రూ.47.7 కోట్ల గ్రాస్ షేర్ వసూళ్ళు సాధించినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా ప్రకటించారు.
చిరంజీవి రెమ్యునరేషన్ మినహాయిస్తే ఈ సినిమాకి ఖర్చైన బడ్జెట్ సుమారుగా రూ.30 కోట్లు మాత్రమే. ఈ మొత్తం చిత్రం విడుదలైన మొదటి రోజే వచ్చిందట. ఖైదీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.47.7 కోట్ల గ్రాస్ షేర్ వసూలు చేసింది. దీంతో చరణ్ నిర్మాతగా మొదటి సినిమాతోనే భారీ లాభాలను సాధించాడు. అంతేకాక శుక్రవారం నుండి సంక్రాంతి పండుగ ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో కూడా కలెక్షన్లు భారీగానే కొనసాగే అవకాశముంది.
మరోవైపు నందమూరి బాలకృష్ణ నటించిన "గౌతమిపుత్ర శాతకర్ణి" కూడా సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ చిత్రం కూడా మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రానికి తొలి రోజున వచ్చిన వసూళ్లపై చిత్ర నిర్మాతలు ఇంకా ప్రకటన చేయలేదు.