మెగా అభిమానిగా మారిన చిరంజీవి తల్లి అంజనాదేవి... థియేటర్‌లో ఏం చేశారో తెలుసా?

బుధవారం, 11 జనవరి 2017 (12:47 IST)
మెగాస్టార్ తల్లి అంజనాదేవి ఓ అభిమానిగా మారిపోయారు. తన బిడ్డ చిరంజీవి ఆరు పదుల వయసులో, 9 సంవత్సరాల విరామం తర్వాత నటించిన "ఖైదీ నంబర్ 150" చిత్రాన్ని వీక్షించేందుకు స్వయంగా థియేటర్‌కు సగటు అభిమానిగా వచ్చారు. ఇతర ప్రేక్షకులతో కలిసి ఆమె తన బిడ్డ చిత్రాన్ని వీక్షించారు. 
 
చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. హైద్రాబాద్ నగరంలో కూడా అనేక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. 
 
నగరంలోని సంధ్య థియేటర్‌లో ఈ చిత్రాన్ని వీక్షించేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులు స్వయంగా వచ్చారు. వీరిలో చిరంజీవి భార్య సురేఖ, తల్లి అంజనాదేవి, హీరో అల్లు అర్జున్, భార్య స్నేహారెడ్డితో పాటు.. ఇతర కుటుంబ సభ్యులు థియేటర్‌కు వచ్చి సినిమా చూశారు. 
 
అల్లు అర్జున్ రావడంతో థియేటర్ వద్ద కోలాహలం మరింత పెరిగింది. యువకులంతా అల్లు అర్జున్‌తో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. ఈ సందర్భంలో స్వల్ప తోపులాట జరిగింది. థియేటర్‌లో అభిమానులతో కలిసి సినిమా చూడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అల్లు అర్జున్ చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి