ఇప్పటికే నేను సైతం లాంటి కార్యక్రమంతో ఆపన్నులని ఆదుకోడానికి ముందుకు వచ్చి తన పెద్ద మనసు చాటుకున్న నటి లక్ష్మీ మంచు.. మరో సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీచ్ ఫర్ ఛేంజ్ పేరుతో ఎలాంటి లాభాపేక్ష ఆశించని సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు దాని ద్వారా నిరుపేద చిన్నారులకు చదువు చెప్పించే బాధ్యతను తీసుకున్నారు.
ఐటీ సంస్థలకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తూ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఫ్లాట్‌ఫామ్‌లో లీడింగ్ కంపెనీగా ఉన్న పెగా సిస్టమ్స్‌తో కలిసి టీచ్ ఫర్ ఛేంజ్ ద్వారా జాతీయ స్థాయిలో సేవలు అందించనున్నట్లు ప్రకటించారు. వసతుల లేమితో ఇబ్బందులు పడే చిన్నారుల్లో అక్షరాస్యతను అభివృద్ధి చేయడంతో పాటు వారిలో నాయకత్వ నైపుణ్యాలు పెంచే విధంగా తీర్చిదిద్దనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో లక్షల సంఖ్యలో ఉన్న 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారులకు నాణ్యమైన విద్యని అందించే దిశగా టీచ్ ఫర్ ఛేంజ్ కృషి చేయనుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వివిధ కమ్యూనిటీలకు చెందిన చిన్నారుల్లో అక్షరాస్యత నైపుణ్యాలను మెరుగుపర్చడానికి ఈ ఎన్జీవో పని చేస్తుంది. ఇందులో భాగంగా శిక్షణ పొందిన వాలంటీర్లు ఎన్జీవో ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు విద్యను బోధిస్తారు. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లలో చురుగ్గా ఉన్న ఎన్జీవో.. ఈ విద్యా సంవత్సరం నుంచి ముంబై, ఢిల్లీ, లక్నో, చెన్నైలకు కూడా తన కార్యకలాపాలను విస్తరించనుంది.
ప్రాథమిక పాఠశాలలు, మున్సిపల్ స్కూల్స్‌లో అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి ఉద్యమంలా చేపట్టిన టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు మద్దతు ప్రకటించాయి. 2014లో లక్ష్మీ మంచు స్థాపించిన ఈ సంస్థ ఐక్యరాజ్యసమితి రూపొందిన అభివృద్ధి విధానాల్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది (గోల్ 4 అంతిమ లక్ష్యం నాణ్యమైన విద్యని అందించడం).
ఈ కార్యక్రమం ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్ కొనసాగుతుండగా.. తాజాగా ముంబై, న్యూ ఢిల్లీ, చెన్నై, లక్నోకు విస్తరించారు. మొత్తం ఎనిమిది చోట్ల విజయవంతంగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఇక వివిధ నగరాల్లోని వేల మంది పౌరులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చిన్నారులకి విద్య బోధించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా వెయ్యి పాఠశాలల్లోని లక్షా 50 వేల మంది చిన్నారుల అక్షరాస్యతా వృద్ధి మీద స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ విశిష్ట కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు శ్రీమతి జయాబచ్చన్, శ్రీమతి రేణుకా చౌదరి, పార్లమెంట్ సభ్యులు శ్రీమతి మూన్ మూన్ సేన్, పొలిటిషియన్ శ్రీమతి గీతారెడ్డి, ప్రముఖ నటుడు డాక్టర్ మోహన్‌బాబుతో పాటు ఆదితి రావు హైద్రీ, సునీల్ సేథ్, తాప్సీ పన్ను, రకుల్ ప్రీత్ సింగ్, రియా చక్రబర్తి, రెజీనా కసాండ్రా, సూరజ్ పంచోలి, కుబ్రా సైత్ సహా అనేకమంది సినీ, ఫ్యాషన్ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.