పూరి జగన్నాథ్ కరోనాకు ముందు రాసుకున్న కథను హీరో విజయ్ దేవరకొండతో పాన్ ఇండియాగా చేసిన ప్రయోగమే లైగర్. మైక్ టైసన్ వంటి ప్రపంచ బాక్సర్‌ను నటింపజేసి చేసిన సినిమాకావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికితోడు విడుదలకుముందు విజయ్ తన యాట్యిట్యూడ్‌తో బాగా పాపులర్ కావడంతో అసలు ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలనేంతగా క్రేజ్ ఏర్పడింది. అలాంటి ఈ సినిమా ఈరోజే విడుదలయింది. ఎలా వుందో చూద్దాం.
కథ:
లైగర్ (విజయ్ దేవరకొండ) ముంబై మురికివాడకు చెందిన వ్యక్తి. బతుకుతెరువు కోసం అమ్మ రామలక్ష్మితో కరీంనగర్ నుంచి ముంబై వచ్చి తోపుడు బండిపై చిన్న వ్యాపారంతో జీవనం సాగిస్తుంటారు. లైగర్‌కు నత్తితోపాటు కోపం ఎక్కువ. ఫైటర్ కూడా. అందుకే కొడుకును ఎం.ఎం.ఎ. (మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) నేర్పించి ఛాంపియన్ చేయాలని కంకణం కట్టుకుంటుంది. అందుకు తగిన కోచ్ రోనిత్ రాయ్ దగ్గరకు వెళ్ళి అడుగుతుంది. అందుకు ఒప్పుకోకపోవడంతో తన భర్త మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేషనల్ ఛాంపియన్ షిప్ లో తలపడుతూ ప్రాణాలు వదిలాడని చెప్పడంతో అందుకు అంగీకరిస్తాడు కోచ్. అతని శిక్షణలో లైగర్ బాగా రాణించి నేషనల్ స్థాయికి చేరుకుంటాడు. ఆ సమయంలోనే తానియా (అనన్య పాండే)తో ప్రేమలో పడతాడు లైగర్. ప్రేమ పక్వానికి వచ్చేసమయానికి నత్తివుందని లైగర్‌ను రిజెక్ట్ చేస్తుంది తానియా. ఆ తర్వాత లైగర్ ఏమయ్యాడు? తన పరిస్థితి ఏమింటి. జాతీయస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్నాడా? అప్పుడు ఏమైంది అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ:
బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ బేస్ కథలు తెలుగులో 'తమ్ముడు'.. 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి'.. హిందీలో 'సుల్తాన్'.. తమిళంలో 'గురు` వచ్చేసాయి. ఈ కథలో హీరో పాత్ర స్ట్రగుల్, కుటుంబం, ప్రేమ, ఎమోషన్స్ అన్నీ సమపాళ్ళలో వుండడంతో అవి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చేశాయి. కానీ లైగర్‌లో అటువంటి ఎమోషన్స్ పెద్దగా కిక్ వుండదు. కేవలం చనిపోయిన తన భర్త ఆఖరి కోరికను కొడుకుచేత ఎలా తీర్చుకుంది అనేది పాయింట్. ఇందులో హీరో కష్టాలు ఏమీ చూపించరు. లైటర్ వేల్‌లో తను తోపుడుబండి వేస్తూ, ఆ తర్వాత శిక్షణలో వాచ్‌మెన్‌లా పనిచేసే షాట్‌లు చూపించాడు. అవి ఏమాత్రం కనెక్ట్ కావు. దాంతో సాదాసీదా కథగా మారిపోవడంతోపాటు చకచకా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం. హీరోయిన్‌ను దక్కించుకోవడం వంటి సీన్స్ వస్తాయి. ఈ పాటి కథను పాన్ ఇండియా సినిమాగా పూరీ తీయడం ఆశ్చర్యంగానే వుంది.
పూరి సినిమాల్లో హీరో పాత్రలు చాలా ఏరగెంట్‌గా వుంటాయి. ఇడియట్ నుంచి ఆ ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ తరహా పాత్రలోనే లైగర్ కూడా. కానీ ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగా ముక్కుసూటిగా పోవడం అనేది ఒక్కటే తేడా. ఏ కథలోనైనా హీరోకు ప్రతినాయకుడు చాలా పవర్‌ఫుల్‌గా వుండాలి. వాడివల్ల అతని కుటుంబానికి లేదా దేశానికి అన్యాయం జరిగింది అంటేనే చూసే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. అది ఇందులో లోపించింది. అవేవీ లేవనే జాతీయత పేరుతో దేశానికి పేరు తెవాలనే కసితోనే హీరో పాత్రను నడిపాడు.
పైగా హీరో పాత్రకు నత్తి పెట్టడం బాగున్నా. అది శృతిమించేదిగా వుండడంతో కేరెక్టరైజేషన్ పడిపోయిందనే చెప్పాలి. ఆంగ్ల సినిమాల్లో ఓ దర్శకుడు ఇలా హీరో పాత్రలకు ఏదో లోపం చూపించి సినిమాలు తీస్తూ హిట్ కొడుతుంటాడు. ఆ ఫార్మెట్‌నే పూరీ ఆచరించానని చెప్పాడు కూడా.
'లైగర్' ప్రోమోలు, ట్రైలర్ చూశాక అందరూ 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిని గుర్తుచేస్తే దానికీ దీనికి పొంతనేలేదని చెప్పాడు. దానికి మరో వర్షన్ తీశాడు అనిపిస్తుంది. మదర్ సెంటిమెంట్ రమ్యకృష్ణతో అంత పర్‌ఫుల్‌గా ఎమోషనల్‌గా లేకుండాపోయింది. ఇక మైక్ టైసన్‌ను చూపించి ఆయనతో ఫైట్ చేయించిన విధానం కామెడీగా వుంటుంది. అతన్ని విలన్‌గా చూపిస్తూ లైగర్ చేసే ఫైట్స్‌కు తను నవ్వుతూ వుంటాడు. మరోవైపు హీరోయిన్ పాత్ర తెలుగువారికి పెద్దగా కనెక్ట్ కాదు. బాలీవుడ్ సినిమా తరహాలోనే ఆమె పాత్ర వుంటుంది. హీరో రింగులోకి దిగడానికి ముందు ప్రేక్షకుల్లో కనీస స్థాయిలో కూడా ఎమోషన్ అన్నది కనిపించదు. ఇక అతను ప్రత్యర్థుల మీద ఎంత చెలరేగిపోతున్నా.. ఎంత కసి చూపిస్తున్నా పెద్దగా కనెక్ట్ కాని పరిస్థితి
పూరీ మార్క్ అంటే ఇంకాస్త బాగుంటుందని వచ్చిన ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. ఫైట్స్ ఫారిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ బాగానే డిజైన్ చేశారు. విజయ్ అదిరిపోయే మేకోవర్ తో నిజమైన ఫైటర్ లాగా కనిపించాడు. ఆ తర్వాత సినిమాటిక్‌గానే అంతర్జాతీయస్థాయికి చేరుకుంటాడు. పాటలపరంగా సిట్యువేషన్ పరంగా చూపినా 'కోకా కోకా' పాట ముగింపులో రావడంతో కిక్ పోయింది.
-- బాక్సర్‌గా విజయ్ దేవర కొండ పడ్డ కష్టమంతా తెరపై కనిపిస్తుంది. ఇండియన్ సినిమాలో ఇలాంటి ఫైటర్ పాత్రలు పోషించిన అందరిలోకి 'ది బెస్ట్' అనిపించే స్థాయిలో వుంది. అతని చుట్టూ వున్న వారిని సరిగా ఉపయోగించుకోవడంలో పూరి జగన్నాథ్ విఫలమయ్యాడు. రమ్యకృష్ణకు కూడా తన స్థాయికి తగ్గ పాత్ర పడలేదు. ఆలీ.. గెటప్ శీను కొంత నవ్వించారు.
-- ఇందులో బ్యాక్ గ్రౌండ్ సంగీతం, బీజియమ్‌లు కోసం అరడజను మంది సంగీత దర్శకులు పని చేశారు. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం కొంచెం డిఫరెంటుగా ట్రై చేశాడు. కొన్ని చోట్ల సన్నివేశాలను ఎలివేట్ చేసినా.. కొన్ని చోట్లా తేడా కొట్టినట్లు అనిపిస్తుంది. విష్ణు శర్మ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు కూడా ఓకే. సినిమా రిచ్ గానే అనిపిస్తుంది. ఏమాత్రం కొత్తదనం లేని ఈ కథతో ఇంత భారీ సినిమా తీయాలని ఎందుకు అనిపించే అర్థంకాదు. విజయ్‌ను పాన్ ఇండియా స్టార్‌గా చూపించాలనే తాపత్రయం వున్నా అందుకు తగిన కథలో కసరత్తులేదు.
విజయ్ దేవరకొండ కష్టపడి పనిచేసినప్పటికీ, పాన్-ఇండియన్ ఖ్యాతిని పొందే సువర్ణావకాశాన్ని పూరి వృధా చేసుకున్నాడు. ఈ సినిమాలో నాకౌట్ పంచ్ లాంటి ఉరుములు మెరుపులు, మలుపులు ఏవీ వుండదు. ఆమధ్య 'ఇస్మార్ట్ శంకర్‌ను తీసిన పూరి జగన్నాధ్ కొత్త ఫార్మెట్‌లోకి రాలేదని తెలుస్తుంది.
ఏవో చిన్న చిన్న సన్నివేశాలు అల్లుకుని యాక్షన్ భాగాలు పెట్టేసి కొద్దిగా సెంటిమెంట్ పెట్టేస్తే హిట్ అవుతుందనే రూలు ఇప్పటి ట్రెండ్‌లో లేదు. అందుకే ఇంకాస్త జాగ్రత్తగా తీసివుంటే బాగుండేది.