తల్లి పాల వారోత్సవాలు గురించి తెలిసిందే. బిడ్డకు తల్లిపాలు ఎంత ముఖ్యమో చెపుతూ ప్రతి ఏడాది తల్లి పాల ప్రాముఖ్యత గురించి ప్రభుత్వాలు ప్రకటనలు కూడా ఇస్తుంటాయి. ఇక సెలబ్రిటీలు అయితే తమ బిడ్డలకు పాలిస్తూ, ఆ ఫోటోలను షేర్ చేస్తుంటారు. తల్లి పాల ఆవశ్యకతను తెలిపేందుకు తమవంతు ప్రయత్నంగా ఇలా చేస్తుంటారు. ఇలాగే నటి-మోడల్ లీసా హేడెన్ కూడా చేసింది.
గత ఏడాది తన కుమారుడు జాక్‌కు పాలిస్తూ వున్న ఫోటోను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో షేర్ చేసింది. ఆ ఫోటోను చూసి చాలామంది కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఆ తర్వాత మెల్లిగా ఆమె ఫోటోపైన ట్రోలింగ్ మొదలైంది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా వుంటానంటున్నారు. ఆవులా ఏడాది మీ బిడ్డకు పాలిస్తారా అంటూ వెకిలి కామెంట్లు చేశారు. కొందరైతే ఇంటర్వ్యూల్లో ఇబ్బందికర ప్రశ్నలను సంధించి అసౌకర్యానికి గురి చేశారు.
దీనిపై లీసా హేడెన్ తాజాగా ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ... తల్లి పాల ప్రాముఖ్యతను గురించి తెలిస్తే ఇలాంటి వెకిలి వ్యాఖ్యలు చేయరు. అసలు తల్లిపాలు బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని పెంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని తెస్తుందని అన్నారు. నేటికీ చాలామంది మహిళలు తమ పాపాయిలకు పాలివ్వడానికి అసౌకర్యంగా ఫీలవుతుంటారనీ, బిడ్డలకు పాలివ్వకుండా డబ్బా పాలు పడుతుంటారనీ, ఫలితంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతారని ఆమె చెప్పుకొచ్చారు. తను షేర్ చేసిన ఆ ఫోటో ఎంతోమంది తల్లులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. నిజమే కదా... బిడ్డకు తల్లిపాలను మించిన అమృతం లేదు కదా.