దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబరు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి.
దీనికి తాజాగా నమోదైన తమిళ రైట్స్ ప్రత్యక్ష ఉదాహరణ. "ఆర్ఆర్ఆర్" తమిళ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా రూ.45 కోట్లకు దక్కించుకున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. తమిళనాడులో రాజమౌళి సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందువల్లే తమిళ్ థ్రియాట్రికల్ రైట్స్‌కు లైకా ప్రొడక్షన్స్ ఇంత పెద్ద మొత్తాన్ని వెచ్చించినట్టు టాక్.
పైగా, సగం డబ్బును ఇప్పటికే చెల్లించినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. దీంతో ఈ వార్త ఇపుడు ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేస్తుంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమ్రం భీం పాత్రలో, అలియాభట్ సీత పాత్రలో నటిస్తున్నారు.
అజయ్ దేవ్‌గన్, శ్రియ, సముద్రఖని ఇతర కీ రోల్స్ లో కనిపించనున్నారు. గతంలో బాహుబలి 2 తమిళ రైట్స్ కు రూ.37 కోట్లు పలికాయి. దీంతో పోలిస్తే మార్కెట్‌లో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం ఓ రేంజ్‌లో ఉంటుందనిపిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో దీన్ని తెరకెక్కిస్తున్నారు.