గాడ్ ఫాదర్ తరహా సినిమా రానా తో తీస్తున్నా : డైరెక్టర్ తేజ

బుధవారం, 31 మే 2023 (17:58 IST)
Director Teja
డైరెక్టర్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌ పై పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో డైరెక్టర్ తేజ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
సినీ నేపథ్యం వున్న వారిని పరిచయం చేసినప్పుడు ఎలాంటి సవాళ్లు వుంటాయి ?
రామానాయుడు గారి ఫ్యామిలీ లోని అబ్బాయితో చేశాం. ఇలా సినీ నేపథ్యంలో వున్న పెద్ద కుటుంబాలలోని వ్యక్తులతో చేసినప్పుడు సహజంగానే పోలికలు వస్తాయి. ప్రతిది భూతద్దం పెట్టి చూస్తారు. అభిరాం కొత్తగా వచ్చాడు. కొత్తవారిలో బెరుకు, భయాలు సహజంగా ఉంటాయి. కానీ ఈ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువగా చూస్తారు. ఆల్రెడీ స్టార్స్ అయిన వెంకటేష్, రానాలతో పోలిక పెట్టి చూస్తారు. దీంతో వారందరినీ దాటి ముందుకు రావడం చాలా కష్టం.
 
కానీ ప్రేక్షకులు అటెన్షన్ వుంటుంది కదా ?  
ఎం ఉండదండీ ..ప్రేక్షకులు చాలా తెలివైన వారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాకి వెళ్ళాలా ?వద్దా ? అనేది డిసైడ్ అయిపోతారు. స్టార్ ని బట్టి వెళితే అసలు పెద్ద స్టార్స్ కి అపజయాలే రాకూడదు కదా. సినిమాలో ఎమోషన్ వుంటే ట్రైలర్ కి వస్తుంది. ప్రేక్షకులు ఆ ఎమోషన్ కి కనెక్ట్ ఐతే స్టార్ సినిమా ? కొత్తవారిదా ? అనే తేడా లేకుండా వచ్చేస్తారు.  ఎమోషన్ కనెక్ట్ అయితే ఎవరి సినిమా అయినా ఆపలేం.
 
పెద్ద స్టార్స్ తో పెద్ద సినిమాలు చేయాలనే లెక్కలు వేసుకోరా ?
పెద్ద స్టార్స్ తో ఎక్కువ డబ్బులు కోసం, ఎక్కువ పేరు కోసం చేయాలి. నేను డబ్బులు, పేరు చూశాను. నేను ఒకప్పుడు ఫుట్ పాత్ మీద వుండేవాడిని. ఓ కెమెరామెన్ దగ్గర డబ్బులు ఇచ్చినా,  ఇవ్వకపోయినా పని చేసేవాడిని. నా పని చూసి ఆయన బ్రేక్ ఇచ్చారు. పుట్ పాత్ నుంచి వచ్చిన నాకు ఆయన బ్రేక్ ఇచ్చారు. నాలా చాలా మంది వున్నారు. చాలా ప్రతిభ వుండి కూడా ఎలా ఎంటర్  అవ్వాలో తెలీదు. వాళ్ళకి నేను బ్రేక్ ఇస్తాను. లైఫ్ ఇస్తాను. ఎక్కడి నుంచో సినిమాపై ఆసక్తితో అనామకులు వస్తారు. వాళ్లకి ఎవరున్నారు ? నేనున్నాను. నేనున్నంత వరకూ ఇస్తాను. నన్నెవరూ మార్చలేరు (నవ్వుతూ). ఓ పెద్ద స్టార్స్ తో సినిమా చేసినా అందులో కొత్తవారిని పెడతాను.
 
మధ్యప్రదేశ్ అడవుల్లో షూట్ చేయడానికి కారణం ?
లోకేషన్స్ చాలా బాగున్నాయి. కొత్త లోకేషన్స్. ఇప్పటివరకూ ఏ సినిమాలో రాలేదు. కథ చెప్పినపుడు విజువల్, ఆడియో, నేపథ్యం అన్నీ కొత్తగా ఉండాలని అక్కడ షూట్ చేశాం.
 
రానా గారితో చేసే సినిమా ఎలా వుంటుంది ?
రాక్షస రాజు అనే టైటిల్ అనుకుంటున్నాం. పాలిటిక్స్, క్రైమ్ నేపథ్యంలో వుంటుంది. గాడ్ ఫాదర్ తరహా సినిమా. ఆచంట గోపీనాథ్ గారు దీనికి నిర్మాత. జూన్ 6 రామానాయుడు గారి పుట్టిన రోజు. ఆ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని రానా అన్నారు.
 
మీరు ఒక ఎగ్జిబిటర్ కూడా.. ఇప్పుడు థియేటర్ బిజినెస్ ఎలా వుంది ? 
థియేటర్ బిజినెస్ బాగుంది. నిజానికి  థియేటర్ అమ్మేస్తే చాలా డబ్బులు వస్తాయి. బ్యాంకు లో వేసుకొని హాయిగా కూర్చోవచ్చు. నాకు అది ఇష్టం లేదు. నష్టమైన లాభమైన పని చేస్తూ ఉండాలి. స్టూడియో, థియేటర్ నాకు గుడి లాంటివి. ఈ గుడిలో మొదలై ఆ గుడిలో రిలీజ్ అవుతాయి. ఈ రెండు గుళ్ళ మధ్య సూపర్ స్టార్స్ తయారవ్వడం జరుగుతుంది. ఈ రెండు గుళ్ళని కాపాడుకోవాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు