మణిరత్నం రెండు చిత్రాల్లో ఒకేసారి ఛాన్స్.. ఐష్‌కు జాక్‌పాట్ తగిలినట్లేనా?

శనివారం, 27 మే 2017 (04:55 IST)
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ను తన చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేయడానికి మణిరత్నం చర్చలు జరుపుతున్నారనేది తాజా సమాచారం. మరో విషయం ఏమిటంటే మణిరత్నం రజనీకాంత్, మమ్ముట్టి కాంబినేషన్‌లో దళపతి–2 చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు చిత్రాల్లో ఐష్‌ను ఏ చిత్రంలో నటింపజేయాలని మణిరత్నం భావిస్తున్నారన్న విషయం ఇంకా ఫైనలైజ్ కాలేదు. 
 
ప్రముఖ దర్శకుడు మణిరత్నం, మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్‌ల మధ్య మంచి ర్యాప్‌ ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో ఇరువర్, గురు, రావణన్‌ మొదలగు మూడు చిత్రాల్లో ఐష్‌ నటించారన్నది గమనార్హం. అంతే కాకుండా మణి ఎప్పుడు పిలిచినా ఆయన చిత్రాల్లో నటించడానికి తాను రెడీ అని ఐశ్వర్యారాయ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.
 
ఆ మధ్య మల్టీస్టారర్‌ చిత్రం ప్లాన్‌ చేసిన మణిరత్నం అందులో ఐష్‌నే నాయకిగా ఎంపిక చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్ర నిర్మాణం జరగలేదు. కాగా తాజాగా మళ్లీ ఐశ్వర్యారాయ్‌ను తన చిత్రంలో నటింపజేసే పనిలో మణిరత్నం ఉన్నట్లు తాజాగా కోలీవుడ్‌లో ప్రచారం జోరందుకుంది.

కాట్రువెలియిడై చిత్రం తరువాత మణిరత్నం తాజా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో టాలీవుడ్‌ యువస్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించనున్నారని, ఆయనకు ప్రతినాయకుడిగా అరవిందస్వామి నటించనున్నారన్నది ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి యోధ అనే టైటిల్‌ నిర్ణయించినట్లు సమాచారం. 
 

వెబ్దునియా పై చదవండి