తెలంగాణ రాష్ట్రంలోని ఓ జిల్లా కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ వైద్య సేవలపై సామాన్య ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తీసుకున్న చొరవను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. తన భార్య విజయ ప్రసవాన్ని గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేయించారు. ఆమె ఆరోగ్యవంతమైన మగ శిశువుకు జన్మనిచ్చారు. ఉన్నత స్థానంలో ఉన్న అధికారి అయివుండి, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యాన్నే ఆశ్రయించడం విశేషం.
ఈ వివరాలను పరిశీలిస్తే, పెద్దపల్లి జిల్లా కలెక్టరుగా కోయ శ్రీహర్ష పనిచేస్తున్నారు. ఆయన భార్య విజయ గర్భందాల్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలోనే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. తాజాగా ఆమెకు నెలలు నిండటంతో ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన గోదవరిఖనిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం ద్వారా కాన్పు చేశారు. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
జిల్లా ప్రథమ పౌరుడుగా భావించే కలెక్టర్ తన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్య సేవలు అందించడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందనే సందేశాన్ని జిల్లా వాసులకు బలంగా పంపినట్టయింది. సామాన్యులకు ప్రభుత్వ వైద్య వ్యవస్థపై మరింత భరోసా కల్పించేలా కలెక్టర్ శ్రీహర్ష తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.