దర్శకరత్న దాసరి నారాయణ రావు ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వారం రోజుల పాటు అనారోగ్యంతో బాధపడుతున్న దాసరి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై దాసరి సన్నిహితులతో మాజీ మంత్రి చేగొండి హరరామజోగయ్య, రాజా వన్నంరెడ్డి తదితరులు మాట్లాడారు. దాసరి ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పినట్లు జోగయ్య పాత్రికేయులకు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన బులెటిన్‌లో దాసరి రెండు మూడు రోజుల్లో కోలుకుంటారని తెలియజేయడంతో జోగయ్య ఊపిరి పీల్చుకున్నారు. దాసరి త్వరగా కోలుకోవాలని మాజీ మంత్రి హరిబాబు ఆకాంక్షించారు. క్షీరపురి ఇంటర్నేషనల్ షార్టు ఫిల్మ్ కమటీ చైర్మన్ ముత్యాల శ్రీనివాస్, కన్వీనర్ డాక్టర్ కెఎస్‌ఎపిఎన్ వర్మ తదితరులు దాసరి సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కాగా దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుకి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయనకు శస్త్రచికిత్స చేసిన అనంతరం డాక్టర్లు బులిటెన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినీనటుడు మోహన్‌బాబు మాట్లాడుతూ... దాసరి నారాయణరావు తప్పకుండా కోలుకుంటారని అన్నారు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ కావాల్సిన మనిషని పేర్కొన్నారు.
దాసరికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు తనకు, దాసరికి కూడా బాగా కావల్సిన వాళ్లని ఆయన పేర్కొన్నారు. తమ గురువు దాసరి నారాయణరావు నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, అందరూ ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించాలని ఆయన అన్నారు