153వ సినిమాగా `లూసీఫర్` రీమేక్‌కి మోహన్ రాజా దర్శకుడు: మెగాస్టార్ చిరంజీవి
బుధవారం, 16 డిశెంబరు 2020 (17:27 IST)
సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ `లూసీఫర్` తెలుగు రీమేక్‌లో నటించేందుకు మెగాస్టార్ చిరంజీవి సర్వసన్నాహల్లో ఉన్న సంగతి తెలిసిందే. `ఆచార్య` చిత్రీకరణ సాగుతుండగానే 153వ సినిమాగా రానున్న ఈ మూవీ స్క్రిప్టును దర్శకుడిని ఫైనల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.
వచ్చే నెల జనవరి 2021 సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్న ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ``లూసీఫర్ సినిమా స్క్రిప్టు ఫైనల్ అయ్యింది. `తని ఒరువన్` (ధృవ) ఫేం మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. రీమేక్ కథ ఓకే అయ్యింది. మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ ప్రతిష్ఠాత్మక స్క్రిప్టును మోహన్ రాజా చాలా బాగా నేరేట్ చేశాడు. సంక్రాంతి తర్వాత సెట్స్ కెళతాం.
ఫిబ్రవరి- మార్చి- ఏప్రిల్ నెలల్లో జరిగే షూటింగ్‌తో ఈ 153వ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. నాతో సినిమా చేయాలని వేచి చూస్తున్న చిరకాల సన్నిహితులు ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా సినిమాల పంపిణీదారుడిగా ఆయనతో ఎంతో అనుబంధం ఉంది`` అని తెలిపారు.
దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ-``మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన హిట్లర్ (ముత్యాల సుబ్బయ్య దర్శకుడు) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఇప్పుడు ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతం. ఈ అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. ఎన్వీ ప్రసాద్ గారు నిర్మాతగా రాజీ లేకుండా తెరకెక్కించనున్నారు`` అని తెలిపారు.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అండ్ ఎన్.వి. ప్రసాద్ (ఎన్ .వి.ఆర్ సినిమా) సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా గురించి నిర్మాత ఎన్.వి. ప్రసాద్ మాట్లాడుతూ, ``చిరంజీవి గారి సినిమాని మోహన్ రాజా తెరకెక్కించడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి వారితో పాటుగా మా అందరికీ నచ్చేలా మార్పులుచేర్పులతో ఎంతో అద్భుతంగా ఈ స్క్రిప్టును మలిచి మోహన్ రాజా మెప్పించారు. బాస్‌తో సినిమా అంటేనే కొత్త ఉత్సాహం అందరిలో నెలకొంది. రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం`` అని తెలిపారు.
మోహన్ రాజా ప్రఖ్యాత ఎడిటర్ మోహన్ వారసుడిగా సుపరిచితం. ఆయన తమిళంలో పాపులర్ డైరెక్టర్. ఐదు తెలుగు సినిమాల్ని తమిళంలోకి రీమేక్ చేసి బ్లాక్‌బస్టర్లు చేసిన రికార్డ్ తనకు ఉంది. ఎడిటర్ మోహన్ నిర్మించిన `హిట్లర్` సినిమాకి ముత్యాల సుబ్బయ్య వద్ద మోహన్ రాజా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు.
ఇప్పుడు చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారనే అభిమానులు భావిస్తున్నారు. తమిళంలో సంచలన విజయం సాధించిన `తని ఒరువన్` (జయం రవి హీరో) దర్శకుడిగా అతడి పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ధృవ` టైటిల్‌తో తనిఒరువన్ రీమేకై తెలుగులోనూ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.