విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి". శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
మే 31వ తేదీన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమానికి 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేయడం మరో విశేషం. ఈ కార్యక్రమంలో "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" నుంచి "గిరి గిరి" అనే మాస్ సాంగ్ ను బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు.
Balakrishna krishna chaitanya viswak sen Neha Shetty
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పటికీ ఒక సినిమాలో డైలాగ్ చెప్పాలంటే టెన్షన్ పడతాను. అదే కాపాడుతుంది అనుకుంటా. సినిమా అంటే అంత పాషన్. ఈ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నిర్మాతలు నాగవంశీ గారికి, సాయి సౌజన్య గారికి ఆల్ ది బెస్ట్. నాన్నగారి 101వ జయంతి సందర్భంగా ఈ సినిమా వేడుక జరగడం సంతోషంగా ఉంది. మనకి సంక్రాంతి, ఉగాది ఎలాగో.. ప్రతి సంవత్సరం మే 28న కులాలకు, మతాలకు అతీతంగా అందరూ జరుపునే పండుగ రామారావు గారి జయంతి. అలాంటి రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా మా సోదరుడు విశ్వక్ సేన్ గురించి చెప్పాలి. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. బయట చూస్తే ఎవరైనా మమ్మల్ని కవలలే అంటారు. సినీ పరిశ్రమలో కొంతమందితోనే నేను చాలా సన్నిహితంగా ఉంటాను. విశ్వక్ కి సినిమా అంటే పాషన్. విశ్వక్ సినీ ప్రయాణాన్ని మొదటి నుంచి చూస్తున్నాను. తను కూడా నాలాగే సినిమా సినిమాకి, పాత్ర పాత్రకి కొత్తదనం చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే ఉడుకు రక్తం, నాలాగే దూకుడుతనం కూడా ఉంది. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ విభిన్నంగా ఉంది. టైటిల్ తోనే సినిమా పట్ల ఆసక్తి కలుగుతోంది. ట్రైలర్ చాలా బాగుంది. గోదావరి అందాలతో పాటు, మంచి ఎమోషనల్ గా ఉంది. మంచి కిక్కిచ్చే సినిమాలా ఉంది. అలాగే దర్శకుడు కృష్ణ చైతన్య. నేను బాలకృష్ణుడిని, ఈయన కృష్ణచైతన్య.. అదీ తేడా. అంతకముందు మా నారా రోహిత్ తో 'రౌడీ ఫెలో', నితిన్ తో 'ఛల్ మోహన్ రంగ' చేశారు. ఆ రెండు సినిమాలు ఆదరణ పొందాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. ఈ సినిమలో ఇద్దరు ముద్దుగుమ్మలు ఉన్నారు నారి నారి నడుమ మురారిలా. అంజలితో కలిసి 'డిక్టేటర్' సినిమా చేశాను. మంచి మనిషి. అలాగే నేహా శెట్టి కూడా డీజే టిల్లు తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. విశ్వక్ సేన్ ని అతని తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అలాగే నా తనయుడు మోక్షజ్ఞ కూడా సినీ రంగంలోకి వస్తాడు. వాడికి ఈ తరం హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెబుతుంటాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్." అన్నారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ నిజానికి కుటుంబ సభ్యుల తర్వాత అంత ప్రేమ చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు బాలకృష్ణ గారి ఆ వాత్సల్యం దక్కింది. నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు కానీ ఈరోజు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా జోహార్ ఎన్టీఆర్ అని మొదలు పెడుతున్నాను. నిజానికి అన్నగారి పోస్టర్ తోనే మా సినిమా ప్రయాణం, ఇదే జయంతి రోజున మొదలైంది. ఇప్పుడు ఇదే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. నిన్న రాత్రి ఐదేళ్లలో ఏం జరిగింది అని ఆలోచిస్తుంటే సరిగ్గా మార్చి 31వ తేదీనే ఫలక్‌నుమా దాస్ రిలీజ్ అయింది. నేను ఇక్కడ నిలుచున్నాను అన్నా, నా ఐదేళ్లు నోట్లోకి వెళుతున్నాయి అన్నా, నాకు ఏం జరిగిందన్నా.. ఫలక్‌నుమా దాస్ అనే సినిమా నేను రిస్క్ తీసుకుని, మా నాన్న రిస్క్ తీసుకుని, నా స్నేహితులు రిస్క్ తీసుకుని ఆ సినిమా తీసినందుకే. ఆ సినిమాని ఆదరించిన ప్రేక్షకుల వల్లనే. అర్థం కాకుండానే ఐదు సంవత్సరాలు అయిపోయింది. ఐదు సంవత్సరాలు నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ సో మచ్, ముఖ్యంగా ఫ్యాన్స్ కి. చాలాసార్లు జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. మీ వల్లనే నిలబడ్డాను. ఇక మా డైరెక్టర్ కి నాకు ఒకరినొకరు పొగుడుకోవడం ఇష్టం ఉండదు. కానీ నన్ను ఎలా ఊహించుకున్నాడో కానీ.. నాకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక పాత్ర దొరికినట్లు అయింది. వెంటనే వంశీ అన్నకి ఫోన్ చేసి "నువ్వు నేను వెతుకుతున్న కత్తి దొరికేసింది అది దింపుదామని" చెప్పి రెడీ చేసిన కత్తి ఈ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. మా ఈ సినిమా కొత్త అప్రోచ్ తో వస్తున్న ఒక కమర్షియల్ సినిమా. బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది కొత్త సీసాలో ఉన్న పాత వైన్ అన్నారు.. సెన్సార్ కూడా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. వైలెన్స్ కూడా కావాలని పెట్టింది కాదు.. ఒక కారణంతోనే ఉంటుంది. రత్న అనే వాడు ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, తిట్టించుకుంటాడు కానీ చివరికి మీతో పాటు ఇంటికి వస్తాడు. చూసిన రెండు మూడు రోజులపాటు వెంటాడుతూనే ఉంటాడు. యువన్ శంకర్ రాజా గారి అభిమానిగా పెరిగాను, ఆయనతో సినిమా చేస్తున్నానని తెలిసి ఆనందపడ్డాను. మా కథానాయకుల గురించి చెప్పాలంటే ముందు రత్నమాల అనే క్యారెక్టర్ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ అంజలి చేయాలని ఒక నిమిషం కూడా గ్యాప్ తీసుకోకుండా చెప్పేశాను. ఒక తమిళ్ సినిమా చూసి ఈమెతో ఎప్పటికైనా పని చేయాలనుకున్నాను. అది ఈ సినిమాతోనే కుదిరింది. ఈ పాత్రకి నువ్వు తప్ప ఎవరు న్యాయం చేయలేరు అంజలి. నేహా నువ్వు ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు అయినా చేయి ఇప్పటివరకు నిన్ను రాధిక అంటున్నారు కానీ ఇకమీదట బుజ్జి అని గుర్తుపెట్టుకుంటారు. రమ్యకృష్ణ గారి నీలాంబరి క్యారెక్టర్ లాగా ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ని గుర్తు పెట్టుకుంటారు. మే 31న ధియేటర్లలో కలుద్దాం." అన్నారు
కథానాయిక అంజలి మాట్లాడుతూ, రత్నమాల అనే పాత్ర ఇంకా ప్రత్యేకం. ఎందుకంటే నేను చేసిన సినిమాలలో, పాత్రలలో రత్నమాల చాలా విభిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు నాకే టఫ్ గా అనిపించింది. ఆ బాడీ లాంగ్వేజ్, ఆమె మాట్లాడే విధానం, డైలాగ్ డెలివరీ, ఇంతకుముందు ఎక్కడ నేను వాడని పద్ధతులు వాడాల్సి వచ్చింది. ఇది మీరందరూ ట్రైలర్ లోనే చూసి ఉంటారు. నాకు రత్న అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు మా దర్శకుడికి థాంక్స్. నా సహనటుడు విశ్వక్ సేన్ టైగర్. విశ్వక్ గురించి చెప్పాలంటే ఆయన స్వీట్ హార్ట్. బేసిక్ గా తనతో వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఆయన పక్కన చేసే వాళ్ళకి చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఈ సినిమాలో రత్న రూపంలో విశ్వక్ కి చాలా రోజులు గుర్తుండిపోయే ఒక పాత్ర దొరికింది. నేహాతో కలిసి కొన్ని సీన్స్ చేశాను కానీ ఆ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంది. మేము మళ్లీ కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. మా కెమెరామెన్ పనితనం అద్భుతం. మీరు చూసిన ఫ్రేమ్స్ అన్ని ఆయన వల్లే సాధ్యమయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా నా మొదటి సినిమా నుంచి నాతో పని చేస్తున్నారు. ఇది ఒక మాస్ మూవీ.. మీరు కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారని భావిస్తున్నాను." అన్నారు.
కథానాయిక నేహశెట్టి మాట్లాడుతూ, నిర్మాత నాగవంశీ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. దర్శకుడు కృష్ణ చైతన్య గారు.. నా జీవితంలో కలిసిన గొప్ప వ్యక్తుల్లో ఒకరు. "మాటలు కంటే చర్యలు చాలా బిగ్గరగా మాట్లాడతాయి" అని ఆయన నమ్ముతారు. ఈ సినిమా విషయంలో అదే జరగబోతుంది. సినిమా అంతా నాతో ఎంతో ఓపికగా ఉంటూ, నన్ను ఎంతగానో ప్రోత్సహించిన చైతన్యకి బిగ్ థాంక్స్. మీ మాస్ కా దాస్, నా సహనటుడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో విశ్వక్ తో నాది అద్భుతమైన ప్రయాణం. కొన్ని సందర్భాల్లో డైలాగుల విషయంలో ఇబ్బంది ఎదురైతే.. విశ్వక్ ఎంతో ఓపికగా నాకు హెల్ప్ చేశాడు. అందరికీ ఇలాంటి కో యాక్టర్ దొరకాలని కోరుకుంటున్నాను. నేను, అంజలి కలిసి కొన్ని సన్నివేశాల్లో నటించాము. త్వరలోనే మళ్ళీ కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ, సరిగ్గా సంవత్సరం క్రితం మే 28న 'జోహార్ ఎన్టీఆర్' అనే ఫస్ట్ పోస్టర్ తో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మొదలైంది. ఆరోజు నుంచి ఈరోజు వరకు వెనకాల ఎన్టీఆర్ గారే ఉండి నడిపిస్తున్నారు అనిపిస్తుంది. ఏ కంటెంట్ రిలీజ్ చేసినా.. గ్లింప్స్ రిలీజ్ చేసినా, టీజర్ రిలీజ్ చేసినా, సాంగ్స్ రిలీజ్ చేసినా, ట్రైలర్ రిలీజ్ చేసినా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. జీవితంలో తల్లి, తండ్రి, గురువు చాలా ముఖ్యం. మా అమ్మగారు, నాన్నగారి ఆశీస్సుల వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను. అలాగే మా గురువుగారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు.. ఈ సినిమాకి మూలం, ఆద్యం.. ఆయనే వల్లే మొదలైంది. అక్కడి నుంచి చినబాబు గారు, నాగవంశీ గారు, సాయి సౌజన్య గారు మమ్మల్ని నమ్మి, మా వెనకాల నిలబడి.. మమ్మల్ని నడిపించారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. చినబాబు గారు స్క్రిప్ట్ దగ్గర నుంచి, చివరి రీల్ పంపించేవరకు వరకు కూడా మాతో కూర్చున్నారు. చినబాబు గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. యువన్ శంకర్ రాజా గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది అన్నారు.
ఈ వేడుక అభిమానుల ఆనందోత్సాహాల నడుమ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఈ కార్యక్రమంలో నటులు హైపర్ ఆది, మధునందన్, ఆనంద్, నృత్య దర్శకులు భాను మాస్టర్, యశ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.