'పుష్ప-3'పై కీలక అప్‌డేట్!!

ఠాగూర్

బుధవారం, 15 జనవరి 2025 (17:35 IST)
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ 'పుష్ప-3' అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ చిత్రం ఘన విజయం అందుకుంది. ఈ సందర్భంగా పాల్గొన్న తాజా ఇంటర్వ్యూలో దాని సీక్వెల్‌ గురించి వెల్లడించారు. దర్శకుడు సుకుమార్‌ 'పుష్ప' పార్ట్‌-3కి సంబంధించి నిరంతరం పని చేస్తున్నారని, ఆ స్టోరీపై రీవర్క్‌ కూడా చేస్తున్నారని తెలిపారు. అంచనాలు ఉన్న నేపథ్యంలో 'పుష్ప-3' విషయంలో మీపై ఒత్తిడి ఉండనుందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'వృత్తిపరంగా నేనెప్పుడూ టెన్షన్‌ పడను. ఒత్తిడి ఉంటే క్రియేటివిటీ ఉండదు. 
 
'పుష్ప-2'కి ది బెస్ట్‌ ఇవ్వాలని నేను, సుకుమార్‌, పాటల రచయిత చంద్రబోస్‌ ముందు నుంచీ అనుకుని, ఆ మేరకు పని చేశాం. సుకుమార్‌ మంచి స్క్రిప్టు రాశారు. అల్లు అర్జున్‌ అద్భుతంగా నటించారు. ఇతర నటులు, టెక్నిషియన్లు ఎంతో కష్టపడ్డారు. 'పుష్ప-1', 'పుష్ప-2'కి ఎలా పనిచేశామో 'పుష్ప-3'కి అదే స్థాయిలో కష్టపడతాం. సుకుమార్‌ విజన్‌, ఆయన స్టోరీలు మాకు స్ఫూర్తి' అని పేర్కొన్నారు. 'పుష్ప-2' కోసం క్రియేట్‌ చేసిన కొన్ని ట్యూన్స్‌ వినియోగించలేకపోయామని, వాటికి 'పుష్ప-3'లో అవకాశం ఉండొచ్చని తెలిపారు.
 
'పుష్ప-3: ది ర్యాంపేజ్‌' పేరుతో కొత్త సినిమా తెరకెక్కున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి.. అటు అల్లు అర్జున్‌, ఇటు సుకుమార్‌ ఇప్పటికే వేర్వేరు ప్రాజెక్టులు ఖరారు చేశారు. ఇప్పటికే సుకుమార్‌.. రామ్‌ చరణ్‌తో ఓ సినిమా ప్రకటించారు. అల్లు అర్జున్‌.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించనున్నారు. బన్నీతో సినిమాలు చేసేందుకు మరికొందరు దర్శకులు సంప్రదించినట్టు సినీ వర్గాల సమాచారం. ఇవి పూర్తయ్యాక 'పుష్ప-3'ని పట్టాలెక్కిస్తారా? అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు