కట్టప్ప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి ది బిగినింగ్ సినిమా ద్వారా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందుకు సమాధానం తెలియాలంటే బాహుబలి 2ని కూడా చూడాల్సిందేనని జక్కన్న ట్విస్ట్ పెట్టి.. బాహుబలి2ని తెరకెక్కించారు. ఈ సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నకు సమాధానమిచ్చాడు.
ఈ సినిమా ట్రైలర్‌లో "నువ్వు నా పక్కనుండగా... నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా" అనే డైలాగ్ కూడా వైరల్ అయ్యింది. ఈ డైలాగ్‌ను ప్రస్తుతం నాని వాడేసుకున్నాడు. కాగా.. బాహుబలి2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే. బాహుబలి-2 సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు స్టార్లు కూడా స్పందిస్తున్నారు. తాజాగా రాజమౌళి తీసిన తొలి అద్భుత కావ్యం ఈగ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు నాని బాహుబలి గురించి ఆసక్తిగా స్పందించాడు.