నాట్యం- చూస్తుంటే స్వర్ణ కమలం మళ్ళీ గుర్తొస్తోందిః వెంకటేష్.
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (13:16 IST)
Venkatesh. Sandhyaraju
`నాట్యం`అంటే ఓ కథను డాన్స్ ద్వారా అందమైన రూపంలో చెప్పడమే. అలాంటి ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం `నాట్యం`. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా పరిచయం అవుతున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల నటసింహ నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించిన ఈ సినిమాలో తొలి సాంగ్ `నమః శివాయ`కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. తాజాగా నాట్యం సెకండ్ సాంగ్ పోనీ పోనీ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ''రేవంత్ దర్శకత్వంలో డాన్సర్ సంధ్య నటించిన నాట్యం సినిమా నుంచి ఈ పోనీ పోనీ సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. విలక్షణ కథకు ఎమోషన్స్ కలగలిపి రూపొందించారు. చాలా చక్కగా డాన్స్ చేశారు. చూస్తుంటే స్వర్ణ కమలం మళ్ళీ గుర్తొస్తోంది. అందమైన లొకేషన్స్‌లో ఎంతో అందంగా చిత్రీకరించారు. డాన్స్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా రాక చాలా రోజులైంది. చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్'' అన్నారు.
సంధ్యారాజు మాట్లాడుతూ.. ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది మా మూవీలో చాలా ముఖ్యమైన ఎమోషనల్ సాంగ్. స్వర్ణ కమలం మూవీ చూసి చూసి ఆ టేప్ అరిగిపోయి ఉంటుంది. ఈ సినిమాలో భాగమవడం ఓ ఆశిర్వాదంలా ఫీల్ అవుతున్నా. ఈ సినిమాలో భానుప్రియ గారు నా తల్లి పాత్రలో నటించారు. అలాగే ముఖ్యమైన సాంగ్ వెంకటేష్ లాంచ్ చేశారు. ఇవి నా జీవితంలో ఎప్పటికీ మరవలేని క్షణాలు'' అన్నారు.
డైరెక్టర్ రేవంత్ మాట్లాడుతూ.. ''ఈ మూవీ చేయడానికి స్వర్ణ కమలం నన్ను ఇన్స్పైర్ చేసింది. టాలీవుడ్‌లో మీరు (వెంకటేష్) ఓ గ్రేట్ యాక్టర్. ఎమోషన్, కామెడీ, ఫైట్స్ ఇలా ఏ క్యారెక్టర్ లో అయినా మీరు లీనమైపోతారు. మా కాలేజీలో ఒక్కొక్కరూ ఒక్కో హీరోకు ఫ్యాన్. కానీ మీ సినిమా విడుదలైందంటే మేమంతా కలిసి వెళ్లే సినిమా అదే అవుతుంది'' అన్నారు.
ఈ సినిమాలో కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, సుభలేఖ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన ముఖ్య పాత్రలు పోషించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కరుణాకర్ అడిగర్ల సాహిత్యం అందించారు. నిశ్రింకళ ఫిలింస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది.