ఒరేయ్ బుజ్జిగా.. నక్కతోక తొక్కావు కదరా..?

బుధవారం, 2 సెప్టెంబరు 2020 (11:14 IST)
Orey Bujjiga
టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ ఉయ్యాలా జంపాల సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో ఆయన నటన, డైలాగ్ తీరు ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా మంచి సినిమాలతో అలరించిన రాజ్ తరుణ్‌కు ఈ మధ్య ఏమి కలిసిరావడం లేదు. ఆయన సినిమాలు అనుకున్నంతగా అలరించలేకపోతున్నాయి. ఇటీవల దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన లవర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
 
తాజాగా ఒరేయ్ బుజ్జిగా.. మాళవిక హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహించాడు. విజయ్ కుమార్ గతంలో ''గుండెజారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం' సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి వుండగా.. వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా కారణంగా ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధమైంది చిత్రబృందం.
 
అందులో భాగంగా "ఒరేయ్ బుజ్జిగా" సినిమా రైట్స్‌ను గంపగుత్తగా జీ గ్రూప్ దక్కించుకుంది. దీంతో రాజ్ తరుణ్ నక్క తోక తొక్కినట్లైంది. మొన్నటివరకు శాటిలైట్ రైట్స్ కోసం మాత్రమే చర్చలు జరిపింది. డిజిటల్ రైట్స్‌ను "ఆహా" యాప్ దక్కించునే ప్రయత్నాలు చేసింది. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు.. మొత్తం అన్ని రైట్స్‌ను జీ గ్రూప్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. 
 
ఇందులో భాగంగా ఈ నెలాఖరుకు లేదా అక్టోబర్ మొదటివారంలో "ఒరేయ్ బుజ్జిగా" జీ5లో స్ట్రీమ్ కానుంది. అయితే ఈ డీల్ విలువ భారీగానే ఉంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమాను 13 కోట్ల రూపాయలకు జీ గ్రూప్ ఫైనల్ చేసినట్టు సమాచారం. ఈ ఆఫర్ రాజ్ తరుణ్ సినిమాకు ఈ చాలా పెద్ద మొత్తమని సినీ పండితులు అంటున్నారు. ఈ సినిమా ఓటీటీలో విడుదల అయితే ఇక రాజ్ తరుణ్ ఖాతాలో బంపర్ హిట్ పడినట్లేనని సినీ పండితులు చెప్తున్నారు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 5న అమేజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు