'ఓయ్.. లేవయ్యా లే.. ఏంటి ఫాలో చేస్తున్నావా..' సింపుల్‌గా "పీపీఎల్ఎం" టీజర్

బుధవారం, 10 అక్టోబరు 2018 (14:11 IST)
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం పడి పడి లేచె మనసు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకుడు. డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.
 
రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం రెండు మనసుల ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా ఉంటుంది. కోల్‌కతా పట్టణ నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథగా దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
శర్వానంద్ పాత్ర సరికొత్త పంథాలో సాగుతుంది. మురళీశర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. 
 
టీజర్‌లో సాయి పల్లవి ఎక్కడికి వెళితే అక్కడికి శర్వా ఫాలో అవుతుంటాడు. సాయి పల్లవి ఓ రెస్టారెంట్‌లో ఉంటే అక్కడికి కూడా శర్వా వెళతాడు. హీరోని గమనించిన సాయి పల్లవి శర్వా దగ్గరకు వెళ్లి.. 'ఓయ్.. లేవయ్యా లే.. ఏంటి ఫాలో చేస్తున్నావా?' అని అడుగుతుంది. 
 
'మీకు తెలిసిపోయిందా? అయినా మీరు ఇలా దగ్గరకు వచ్చి మాట్లాడటం ఏమీ బాగోలేదండి. ఏదో నేను అర కిలోమీటరు దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే' అని శర్వా అంటాడు. భారీ భారీ డైలాగ్స్ లేకుండా సింపుల్‌గా.. ఆకట్టుకునేలా టీజర్‌ను వదిలింది చిత్రబృందం. టీజర్‌ని బట్టి చూస్తే శర్వా తన ఖాతాలో మరో హిట్‌ను వేసుకోనున్నాడని చెప్పొచ్చు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు