బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలపై పాకిస్థాన్ నటి, గాయని రబీ పీర్జాదా తీవ్ర విమర్శలు గుప్పించింది. సల్మాన్ ఖాన్ సినిమాల్లో హింస ఎక్కువగా ఉంటుందని.. ఆయన సినిమాల ద్వారా నేరాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించింది. అంతేగాకుండా.. బాలీవుడ్‌లో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాలోనూ క్రైమ్ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. సినిమాల ద్వారా యువతకు ఏం నేర్పుతున్నారో భారత సినీ దర్శకులు చెప్పాలని డిమాండ్ చేసింది.
సామాజిక అంశాలతో పాటు సందేశాన్నిచ్చే నీతికథలతో ఒకప్పుడు పాకిస్థాన్ సినీ పరిశ్రమ ఎంతో గొప్పగా ఉండేదని.. కానీ బాలీవుడ్ దాన్ని పూర్తిగా నాశనం చేసిందని పీర్జాదా తెలిపింది. కాగా ఒకప్పుడు కళకళలాడిన పాకిస్థాన్ ఫిలిమ్ ఇండస్ట్రీ.. ప్రస్తుతం వెలవెలబోతోంది. అక్కడి ప్రేక్షకులంతా బాలీవుడ్ సినిమాల వైపు దృష్టి మళ్లించారు. దీంతో ఏం చేయాలో తోచక సినీ నటులు ప్రేక్షకుల కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. కానీ బాలీవుడ్ సినీ పరిశ్రమ పాక్ ప్రేక్షకులను తనవైపు లాక్కోవడంపై రబీ పీర్జాదా లాంటి నటులు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని సినీ పండితులు అంటున్నారు.